ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు మృతిపట్ల సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు సంతాపాన్ని ప్రకటించాయి.
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు మృతిపట్ల సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు సంతాపాన్ని ప్రకటించాయి. చలనచిత్రరంగంలో బహుముఖ సేవలందించి, దాదా సాహెబ్‌ఫాల్కే అవార్డును పొందిన ఆయన సినీరంగంలో ఎందరో నటీనటులు, సాంకేతికనిపుణులను పరిచయం చేసిన గొప్ప నిర్మాత అని సీపీఐనేత చాడ వెంకటరెడ్డి కొనియాడారు. చలన చిత్రరంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా సేవలందించారన్నారు. పలుభాషల్లో చిత్రాలను నిర్మించి, కొన్నిచిత్రాల్లో నటించిన రామానాయుడిది తెలుగుసినీరంగప్రస్థానంలో ప్రముఖస్థానమని సీపీఎంనేత తమ్మినేని వీరభద్రం తమ సందేశంలో పేర్కొన్నారు.
సినీరంగంలో, ప్రజాజీవితంలో ఒక మూలస్తంభం వంటి రామానాయుడిని కోల్పోవడం తెలుగువారికి తీరనిలోటని లోక్‌సత్తానేత జయప్రకాష్‌నారాయణ పేర్కొన్నారు. సినీరంగంలో పేరుఫ్రఖ్యాతులు, జీవితంలో విజయాలతో పాటు స్వగ్రామం కారంచేడు, చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలిచారని ఆయన తెలిపారు. పలువురు వామపక్ష, లోక్‌సత్తాకు చెందిన నాయకులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.