థియేటర్లకు దారేది?
పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ మేకింగ్ దశలోనే ఓ సెన్సేషన్. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూపులు.
పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ మేకింగ్ దశలోనే ఓ సెన్సేషన్. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూపులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నూరైనా ఆగస్టు 7న విడుదలవుతుందనుకున్న ‘అత్తారింటికి దారేది’కి సమైక్యాంధ్ర ఉద్యమం పెద్ద బ్రేక్ వేసింది. బిజినెస్‌తో సహా అన్ని వ్యవ హారాలు పూర్తి చేసుకుని, ఇక సినిమా రిలీజే ఆలస్యం అనుకుంటున్న సమ యంలో, సీమాంధ్రలో మొదలైన ఉద్యమం తాలూకు సెగలతో సినిమా విడుదలను అర్ధాంతరంగా నిలిపేయాల్సి వచ్చింది.
ఉద్యమం వల్ల చిన్న సినిమాల విడుదలకు ఎటువంటి ఆటంకం లేకపోయినా, పెద్ద సినిమాల పరిస్థితే చాలా గందరగోళంగా ఉంది. ఎటు వెళ్తే ఏం ముంచుకొస్తుందో అనే శంక దర్శక నిర్మాతలను పట్టి పీడిస్తోంది. అందుకే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు వెనక్కెనక్కు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి కళ్లూ ‘అత్తారింటికి దారేది’ మీదే ఉన్నాయి. ఇప్పటికే ఆడియో సూపర్‌డూపర్ హిట్ కావడంతో సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. ఇప్పటివరకూ తెలుగు చిత్రసీమలోనే అత్యధిక స్థాయిలో ఈ సినిమా బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు.
ఇంతకూ అత్తారింటికి వెళ్లడానికి దారి ఎప్పుడు సుగమం అవుతుంది? అందరిలోనూ ఇదే ఉత్కంఠ. ఈ వారమే వస్తోందంటూ వెబ్‌సైట్లలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఇంతవరకూ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు. సెప్టెంబరు 6న ‘తుఫాన్’ విడుదలవుతోంది. ఆ తరువాతి వారమే ‘అత్తారింటికి దారేది’ విడుదలయ్యే అవకాశం ఉందని ఫిలిమ్‌నగర్ వర్గాల సమా చారం. నిర్మాతలు కూడా అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ సెప్టెంబరు రెండోవారం కుదరకపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ మూడోవారం వచ్చేయాలని అటు పంపిణీదారులు కూడా పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది.