తారల విషాదగాథలే... తెరపై అద్భుత కావ్యాలా?

Cinema Stars Biopics On Silver Screen Like Mahanati Dirty Picture Sanju - Sakshi

చిత్ర సీమలో వెలిగిన తారలెందరో. నేలకు రాలిన తారలు మరెందరో. కొందరి తారల గాథలు సినిమా కథలా విషాదంతో ముగిశాయి. జీవితంలో ఓడిపోయినా.. వారి జీవితాన్ని కథగా మలిస్తే... అవి వెండితెరపై అద్భుతాలను సృష్టించాయి. అవే డర్టీపిక్చర్‌, మహానటి. 

సిల్క్‌ స్మిత. అప్పట్లో ఓ క్రేజీ స్టార్‌. ఈమె చూపుల్లోనే ఏదో మత్తు ఉన్నట్లు కుర్రకారుకు మతి పోగొట్టేసింది. కేవలం ఈమె నర్తించిన పాటల కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు ఉండేవారు. సినిమాలో ఈమె చేసిన ప్రత్యేక గీతం తరువాత థియేటర్లో ఎవరూ ఉండేవారు కాదట. అంతలా ఆమె పాపులార్టీని సొంతం చేసుకుంది. ఒకానొక దశలో ఈమె స్టార్‌ హీరోలు, హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్‌ ఉండేది. తెరపై మాత్రమే అశ్లీల పాత్రలు చేసే ఈమె.. వ్యక్తిగతంగా ఎన్నో నిగూఢ దానధర్మాలు చేసేవారట. సిల్క్‌స్మిత ఎంతో మంచి వారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అలాంటి సిల్క్‌స్మిత కథను ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్స్‌ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

ఇక సినీ తారల జీవిత చరిత్రను తెరకెక్కించిన వాటిలో చెప్పుకోదగ్గ సినిమా మహానటి. తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో మహానటిగా గుర్తింపు పొందిని సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అంతటి నటికి నివాళిగా పేర్కొన్నారు సినీ అభిమానులు. సినీ జీవితాన్ని ప్రారంభించడం, అందులోని ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితం, చివరి దశ అన్నింటిని మనసుకి హత్తుకునేలా చిత్రీకరించారు. మహానటి సావిత్రిని గుర్తుంచుకున్నంత కాలం ఈ ‘మహానటి’ సినిమాను కూడా గుర్తుంచుకుంటారు. 

బాలీవుడ్‌కు పెద్దన్న సంజయ్‌ దత్‌. ఎన్నో వివాదాలు, ఇంకెన్నో ఎఫైర్స్‌, దుర్భరమైన జైలు జీవితం గడిపిన సంజయ్‌ దత్‌ జీవితాన్ని తెరకెక్కించారు రాజ్‌ కుమార్‌ హిరాణీ. తన ప్రతి సినిమాలో సమాజానికి ఏదో ఒకరకమైన సందేశాన్ని ఇచ్చే దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీ. మున్నాభాయ్‌ సిరీస్‌, పీకే, త్రీ ఇడియట్స్‌ ఇలా ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేశారు హిరాణీ. తాజాగా తన ఆప్త మిత్రుడైన సంజయ్‌ దత్‌ ప్రస్థానాన్ని సంజు పేరుతో వెండితెరపై ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్‌ కపూర్‌ నటనకు బీ టౌన్‌ మొత్తం ఆశ్చర్యపోతోంది. ట్రైలర్‌లో సంజయ్‌ను మరిపించేలా యాక్ట్‌ చేసిన రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి నటనను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. 

అంతేగాక సంజయ్‌దత్‌ జీవితంలోని చీకటి కోణాలను కూడ ఈ సినిమా ప్రస్థావించబోతోంది. సంజయ్‌కు ఎంతమంది అమ్మాయిలతో ఎఫైర్‌ ఉందన్న విషయం, డ్రగ్స్‌కు బానిసైన పరిస్థితుల గురించి, ముంబై పేలుళ్ల గురించి కూడా ఈ సినిమాలో టచ్‌ చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు కావల్సినంత ట్విస్ట్‌లు, రొమాన్స్‌, ఎమోషన్స్‌ అన్నీ ఉన్న సంజయ్‌ దత్‌ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన ఎటువంటి ఆంక్షలు పెట్టకపోవడం ఆశ్చర్యకరం. పైన మాట్లాడుకున్న రెండు సినిమాలు వారి మరణానంతరం కథలను వెండితెరపై ఆవిష్కరించారు. కానీ జూన్‌ 29న రానున్న సంజు మాత్రం అందుకు విరుద్దంగా వస్తోంది. ఈ సినిమా సంజయ్‌ దత్‌కు ఎలాంటి ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి మరి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top