ఏడుపు కూడా రావడం లేదు: అమృతా ప్రణయ్‌

Amrutha And Ram Gopal Varma Responds On Murder Movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది వివాదాలు. ఎప్పుడు ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ మీడియాలో ఉండే వర్మ తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వర్మ జూన్‌ 21 ఫాదర్స్‌ డే సందర్భంగా మూవీ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. అందులో మారుతీరావు, అమృత పాత్రలను పరిచయం చేస్తూ.. 'ఓ తండ్రి తన కూతురుని అమితంగా ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇందులో చూపించబోతున్నా. ఫాదర్స్‌ డే రోజున ఒక విషాదభరితుడైన నాన్న పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నా' అంటూ వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

దీనిపై అమృతా ప్రణయ్‌ స్పందించినట్లు ఓ పోస్ట్ సోషల్‌ మీడియాలో‌ వైరల్‌ అవుతోంది. అందులో.. ‘పోస్టర్‌ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ప్రేమించిన పాపానికి భర్తను పోగొట్టుకున్నాను.  కన్న తండ్రికి దూరమయ్యాను. నా జీవితం తలకిందులైంది. నా వ్యక్తిత్వం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. నేను ఏంటనేది నాతో ఉన్న వాళ్లకి మాత్రమే తెలుసు. ఇప్పుడు వాటన్నిటినీ భరిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతుంటే రామ్‌ గోపాల్‌ వర్మ రూపంలో నాకు మరో సమస్య ఎదురవుతోంది. దీనిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామనుకున్నా కన్నీళ్లు ఇంకిపోయాయి. ప్రశాంతంగా ఉన్న సమయంలో సినిమా రూపంలో మరోసారి అందరి దృష్టి నాపై పడేలా చేస్తున్నావు. డబ్బు, పేరు కోసం నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. ఎన్నో బాధలను అనుభవించిన నాకు ఈ బాధ మరీ పెద్దది కాదు' అంటూ అమృత వ్యాఖ్యలు చేశారు. చదవండి: అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్‌

అయితే అమృత చేసిన వ్యాఖ్యల‌పై వర్మ తాజాగా స్పందిస్తూ.. మొదటగా నేను రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో మర్డర్‌ ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్నది అని స్పష్టంగా చెప్పాను. కానీ నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పుకోలేదు. గతంలో కూడా నిజ జీవిత కథల ఆధారంగా నేను తీసిన ఎన్నో కథలను ప్రజలు ఆదరించారు. నేను కొందరిని మంచివారిగా.. మరికొందరిని చెడువారిగా చూపిస్తున్నానంటూ అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఎవరూ చెడ్డవారు కాదు. పరిస్థితులు మాత్రమే మనిషిగా చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అమృత లేదా మరెవరైనా సరే బాధ అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉంది. నా చిత్తశుద్ధితో వారి బాధలను గౌరవిస్తూ.. మర్డర్‌ సినిమాలో వారు ఎదుర్కొన్న పరిస్థితులనే చూపిస్తున్నట్లు' వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వర్మ వరుసపెట్టి ట్వీట్స్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top