ఇకపై బేతాళ్‌ నటిగా గుర్తిస్తారు: సుచిత్రా పిళ్లై

Actress Suchitra Pillai Thanks OTT Platforms Helps To Get New Audience - Sakshi

హార్రర్‌ థ్రిల్లర్‌గా బేతాళ్‌

డిజిటల్‌ ప్లాట్‌ఫాంల కారణంగా నవతరం ప్రేక్షకులకు చేరవయ్యే అవకాశం లభించిందని నటి సుచిత్రా పిళ్లై హర్షం వ్యక్తం చేశారు. దిల్‌ చాహ్‌తా హై గర్ల్‌గా సినీ అభిమానులకు సుపరిచితమైన సుచిత్ర.. ‘బేతాళ్‌’అనే వెబ్‌సిరీస్‌తో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో చాలా ఏళ్ల తర్వాత తనను అందరూ గుర్తుపడుతున్నారని.. ఇకపై తనను బేతాళ్‌ నటిగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నారన్నారు.

‘‘ఓటీటీ కారణంగా కొత్త ప్రేక్షకుల అభిమానం పొందగలుగుతున్నాం. బేతాళ్‌ చూసిన తర్వాత వారి స్పందన ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. 25 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి క్యారెక్టర్‌ మొదటిసారి. ఇందులో నన్ను చూసి నేనే ఆశ్చర్యపోయాను. దర్శకుడు పేట్రిక్‌ అంతా సవ్యంగా సాగేలా చూసుకున్నారు’’అని సుచిత్ర పిళ్లై పీటీఐతో తన అనుభవాలు పంచుకున్నారు. కాగా పలు టీవీ షోల్లో నటించిన ఆమె..  దిల్‌ చాహ్‌తా హై సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ ప్రేయసిగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.  పేజ్‌ 3, ఫ్యాషన్ వంటి చిత్రాల్లోనూ సుచిత్ర కనిపించారు. (హ్యాపీ బర్త్‌డే పప్పా: జెనీలియా, రితేశ్‌ భావోద్వేగం)

బేతాళ్‌: మనుషులను పీక్కుతినే జాంబీలు
బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ రెడ్‌చిల్లీస్‌ ఎంటర్టేన్‌మెంట్‌ నిర్మాణ సారథ్యంలో పేట్రిక్‌ గ్రాహం, నిఖిల్‌ మహాజన్‌ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లింగ్‌ హార్రర్‌ ‘బేతాళ్’‌. ఆదివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఇక బేతాళ్‌ కథ విషయానికొస్తే... 1857లో ఓ సొరంగంలో సజీవ సమాధి చేయబడిన బ్రిటీష్‌ కల్నల్‌.. భారత్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు.. గుహలో ఉన్న బేతాళుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కన్నకొడుకునే బలిచ్చి అతీంద్రీయ శక్తులు సంపాదిస్తాడు. తనతో పాటు బంధీలుగా ఉన్న ఇతర సైనికులను చంపి తిని.. వాళ్లను కూడా తనలాగే నరరూప రాక్షసులు(జాంబీలు)గా మారుస్తాడు.

అయితే వాళ్లు ఆ గుహ నుంచి బయటపడాలంటే ఓ బాలికను బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓ కార్పొరేటర్‌‌ దురాశ, నీచబుద్ధి కారణంగా ఆదివాసీలకు కష్టాలు ఎదురుకావడంతో పాటుగా.. జాంబీలకు అక్కడి నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఈ లైన్‌తోనే తొలుత అత్యంత ఆసక్తికరంగా సాగిన సిరీస్‌... ఆ తర్వాత క్రమంగా సాదాసీదా సన్నివేశాలతో సాగడం కాస్త విసుగు తెప్సిస్తుంది.(టీవీ న‌టి ఆత్మ‌హ‌త్య)

ఇక బేతాళ్‌లో సుచిత్రా పిళ్లై పాత్ర విషయానికొస్తే.. జాంబీల సొరంగం సమీపంలో ఉండే ఏజెన్సీలోని ఆదివాసీలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు రంగంలోకి దిగిన.. సీపీఐడీ బృందానికి నాయకత్వం వహించే చీఫ్‌ కమాండెంట్‌గా త్యాగీ క్యారెక్టర్‌లో సుచిత్ర మనకు కనిపిస్తారు. ఆమెకు నమ్మిన బంటుగా ఉండే డిప్యూటీ విక్రమ్‌ సిరోహి(వినీత్‌ కుమార్‌ సింగ్‌)ను అడ్డుపెట్టుకుని తన స్వార్థం కోసం కార్పొరేట్‌తో పన్నిన కుట్ర, ఈ క్రమంలో టన్నెల్‌ తెరిచేందుకు చేసే ప్రయత్నాల్లో తానే బలిపశువుగా మారడం వంటి సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top