వాల్టాకు తూట్లు | Timber mafia in medak district | Sakshi
Sakshi News home page

వాల్టాకు తూట్లు

Jan 4 2018 4:07 PM | Updated on Oct 8 2018 4:18 PM

పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఓ వైపు ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతుంటే...

పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఓ వైపు ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతుంటే... మరో వైపు కలప అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. వాల్టా చట్టం అక్రమార్కులకు చుట్టంగా మారుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వృక్షాలను నరుకుతున్నారు. గ్రామాల్లో భారీ వృక్షాలు కనుమరుగవుతున్నా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కలపను అక్రమంగా తరలిస్తున్నారని ఫారెస్ట్‌ అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇస్తే వారి జేబులు నింపేసుకుంటున్నారనే తప్ప వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదు. లారీల్లో కలప రవాణా చేసేందుకు సిద్ధంగా ఉందని చెబితే అక్కడికి చేరుకున్న ఫారెస్టు అధికారులు మామూళ్లు తీసుకుని వెళ్లిపోతున్న సంఘటనలు కోకొల్లలు.


అల్లాదుర్గం(మెదక్‌): అల్లాదుర్గం మండలంలో కలప అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. మండల పరిధిలోని రెడ్డిపల్లి, వెంకట్‌రావ్‌పేట, గడిపెద్దాపూర్, ముస్లాపూర్, చిల్వెర గ్రామాల్లో అక్రమార్కులు చెట్లను నరికి పట్టపగలే లారీల్లో తరలిస్తున్నారు. హైదరాబాద్, పెద్దశంకరంపేట, రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన వ్యాపారులు స్థానిక ఫారెస్ట్‌ అధికారులను మేనేజ్‌ చేసుకుంటూ యథేచ్ఛగా తమ పని కానిచ్చేస్తున్నారు. జిల్లా ఫారెస్టు అధికారులు మాత్రం కలప అక్రమ వ్యాపారాన్ని చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, వాల్టా చట్టం ప్రయోగించి వాహనాలను సీజ్‌ చేస్తామని చెబుతున్నా... ఎక్కడా అమలు కావడం లేదు. చెట్లను నరికిన కలప దుంగలను రోడ్డు పక్కనే తరలించేందుకు సిద్ధంగా ఉంచినా అధికారులు మాత్రం వాటి జోలికి పోకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల పంట పొలాల్లోని చెట్లను నరుక్కోవాలంటే రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. చెట్లను కొట్టాలంటే కొంత రుసుం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరుకుతూ కట్టెకోత మిషన్లకు, హైదరాబాద్‌ ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం 10 లారీల వరకు కలప రవాణా కొనసాగుతోంది.

అక్రమంగా నిల్వ
అల్లాదుర్గం మండలంలోని కట్టెకోత మిషన్ల యజమానులు కలప వ్యాపారం చేపడుతున్నారు. అనుమతులు లేకున్నా చెట్లను నరుకుతూ భారీ ఎత్తున కొత మిషన్లలో నిల్వ ఉంచుతున్నా... వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫారెస్టు అధికారులు ఒక్కో లారీకి రూ.రెండు వేలు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్కమార్కులు తమ పలుకుబడిని ఉపయోగించి వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. శనివారం, ఆదివారం, సెలవు రోజుల్లో రాత్రిపూట కలపను లారీల్లో భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

అనుమతులు ఇవ్వలేదు
కలప రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కలప అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్‌ చేస్తాం. వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కట్టెకోత మిషన్ల ద్వారా రైతులకు సంబంధించిన పనిముట్లు, వంట చెరుకుగా వినియోగించుకోవచ్చు. అనుమతిలేకుండా కలపను రవాణా చేస్తే చర్యలు తప్పవు. కలప అక్రమ వ్యాపారాన్ని అరికడతాం.
– వెంకట్‌రామయ్య, పెద్దశంకరంపేట ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement