తీసుకెళ్లకుంటే చచ్చిపోతానంది..

Telugu Love Stories : Raja Happy Ending Love Story - Sakshi

సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి హాస్టల్‌లో జాయిన్‌ అయ్యాను. ఓ రోజు చల్లని సాయంకాలం వేళ హాస్టల్‌పైకి వెళ్లాను. నా మొబైల్‌ ఫోన్‌ ట్రింగ్‌ ట్రింగ్‌ మని మ్రోగింది. ఏదో ఎస్‌టీడీ నెంబర్‌నుంచి ఫోన్‌. హాలో.. ఎవరు అని అడిగాను. ‘ హాలో​! ప్రసాద్‌ గారు’ అని ఒక అమ్మాయి గొంతు. ‘కాదండి’ అని అన్నాను. 
అమ్మాయి : మీరెవరు?
నేను : ఇంతకీ మీరెవరు?
అమ్మాయి : మీరు ప్రసాద్‌ గారేనా
నేను : కాదండీ బాబు! ఒకసారి నెంబర్‌ చెక్‌ చేసుకోండి
ఆ అమ్మాయి నమ్మలేదు. ‘సరే! మీ పేరేంటి?’ అని అడిగింది. ‘ముందు మీ పేరు చెప్పండి’ అన్నాను. ‘ నా పేరు అమ్మాయి ’ అంది. ‘ అబ్బ ఛా! ఫోన్‌ పెట్టేయ్‌’ అన్నాను. కాల్‌ కట్‌ చేసింది. మళ్లీ కాల్‌ చేసింది. మళ్లీ ఫోన్‌ పెట్టేయమని గట్టిగా అరిచాను. 
తర్వాత రోజు మళ్లీ అదే టైంకు ఫోన్‌! మళ్లీ ట్రింగ్‌ ట్రింగ్‌ మంది.
‘ హలో ఎవరు?’ 
‘ హలో ప్రసాద్‌ గారేనా?’
‘మళ్లీ నువ్వేనా ఏంటి? మళ్లీ మళ్లీ ఫోన్‌ చేస్తున్నావు’
‘నిన్న ఫోన్‌ చేసింది నేను కాదు. నేను వేరే అమ్మాయిని’ 
‘నిజం చెప్పు! నిన్న ఫోన్‌ చేసింది నువ్వే కదా?’
‘కాదు’
‘ మరి ప్రసాద్‌ అని ఎందుకు అడిగావు’ 
‘అది వేరే అమ్మాయి.. అప్పుడు నేను కూడా ఉన్నాను’
‘నేను ప్రసాద్‌ను కాదు’ 
‘తెలుసు బాబు నాకు, ఎందుకు అంత చిరాకు. ఫోన్‌ చేసింది నేనే కదా. నాకే కదా బిల్లు’ 
( అప్పుడే కొత్తగా మార్కెట్‌లోకి మొబైల్‌ ఫోన్‌ వచ్చింది. మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడటం అంటే సరదా.)
‘ సరే చెప్పండి. నీ పేరు’
‘ శాంతి. మరి నీ పేరు.’ 
‘ రాజా’
అప్పటినుంచి మా మధ్య బంధం పెరిగింది. అలారం పెట్టుకుని ప్రతిరోజూ మాట్లాడుకునేవాళ్లం. మా ఇష్టాయిష్టాలు, అభిరుచులు కలిశాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఓ రోజు కలుద్దామని అనుకున్నాం. ఓ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాం. కానీ, నాకు జాబ్‌ రావటం వల్ల కలవలేకపోయాం. వేరేవేరే కారణాలతో అలా ఓ సంవత్సరం గడిచింది. మా మధ్య బంధం మరింత బలపడింది. ఆ తర్వాత శాంతి వాళ్ల ఇంట్లో తను ఫోన్‌ మాట్లాడుతున్న సంగతి తెలిసిపోయింది. ఓ రోజు నాకు ఫోన్‌ చేసింది. ‘ఇమీడియట్‌గా ఫోన్‌ నెంబర్‌ మార్చు. మా వాళ్లు నీ నెంబర్‌ తీసుకున్నారు.’ అని చెప్పింది. ఫోన్‌ నెంబర్‌ మార్చి కొత్త నెంబర్‌ ఇచ్చాను.

ఒకసారి మాత్రమే మాట్లాడింది. చాలా రోజులు ఫోన్‌ చేయలేదు. ఏదో తెలియని బాధ మొదలైంది. నా మనసంతా శాంతి కోసమే తపించిపోయింది. తనను చూడాలని, మాట్లాడాలని, ఏం జరిగిందో తెలుసుకోవాలని అల్లాడిపోయాను. తర్వాత ఓ రోజు ఫోన్‌ చేసి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నన్ను వచ్చి మాట్లాడమని అంది. తన పేరు, ఊరు తప్ప ఇంకేమీ తెలియదు. ఫోన్‌లో మాట్లాడుకున్నాం. మనస్సులు కలిశాయి. కానీ, శాంతి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లను ఎలా ఒప్పించాలి. అది జరిగేపని కాదు. శాంతి మళ్లీ ఫోన్‌ చేసింది. ‘నిన్ను తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోను. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లు. లేదంటే చచ్చిపోతాను’అంది. నాకు అర్థం కాలేదు. ఏమీ ఆలోచించకుండా సరే అన్నాను.

ప్రేమించడానికి రెండు మనస్సులు చాలు కానీ, పెళ్లికి రెండు కుటుంబాలు కావాలి. ఎలా? తను ఉన్న పరిస్థితుల్లో నేను తప్పకుండా వెళ్లాలి. నిర్ణయం తీసుకున్నాను. శాంతి ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూశాను. ఫోన్‌ వచ్చింది. ‘పెళ్లి చేసుకుందాం. నీ కోసం వస్తాను. నువ్వు రాగలవా’ అన్నాను. వస్తానంది. ఇద్దరం ఒక డ్రెస్‌ కలర్‌ సెలెక్ట్‌ చేసుకున్నాం. మరుసటి రోజు విజయవాడ బస్‌స్టాండ్‌లో తన కోసం ఎదురు చూశాను. వస్తానన్న టైంకు రాలేదు. టైం గడిచిపోతోంది. టెన్షన్‌ పెరిగిపోతోంది. చాలా సమయం ఎదురు చూశాను. ఏమి చేయాలో అర్థం కాలేదు. శాంతికి ఫోన్‌ చేద్దామంటే ఫోన్‌ లేదు. ఎలా.. ఎలా.. చాలా సమయం తర్వాత. పర్పుల్‌ కలర్‌ పంజాబీ డ్రెస్‌ వేసుకుని వచ్చింది.

నేను కూడా పర్పుల్‌ కలర్‌ షర్ట్‌ వేసుకున్నాను. నా దగ్గరకి వచ్చి రాజు అంది. నేను నువ్వు శాంతివా అన్నాను. తొందరగా వెళ్లిపోదాం పద అంది. సరే అని ఇద్దరం తిరుపతి బస్‌ ఎక్కాము. నా ఫ్రెండ్స్‌ సహకారంతో మా పెళ్లి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి సమక్షంలో జరిగింది. తర్వాత ఇంట్లో వాళ్లను ఒప్పించాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. ఒక వేళ నేను వెళ్లకపోయినా, తాను రాకపోయినా, లైఫ్‌లో ఒక మంచి అమ్మాయిని మిస్‌ అయ్యే వాడ్ని. అలా ఒకరిని ఒకరము చూసుకోకుండానే, మనస్సులు కలిసి పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు అందరూ మా జంట బాగుందంటున్నారు. మా ఇద్దరిని ఇలా కలిపిన దేవుడికి జీవితాంతం రుణపడి ఉంటాము.
- రాజా, హైదరాబాద్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top