
ప్రతీకాత్మక చిత్రం
నలుగురితో నాలుగు సార్లు లవ్‌లో పడ్డా. ఇప్పుడు...
నాది రాజమండ్రి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక జాబ్ కోసం నేను ఇంటినుంచి దూరంగా హైదరాబాద్ వచ్చా. ఒక చిన్న జాబ్‌లో జాయిన్ అయ్యా. అప్పుడే నేను ఓ అమ్మాయిని చూశా. లవ్ యాట్ ఫస్ట్ సైట్ అంటారు! అది నిజమో కాదో అప్పటి వరకు నాకు తెలీదు. కానీ, తనను చూడగానే నచ్చింది. తను చాలా సైలెంట్‌గా తన పని తాను చూసుకునేది. మిగిలిన వాళ్లమంతా చాలా బాగా ఫ్రెండ్స్ అయ్యాం. కొన్ని రోజుల తర్వాత తనతో మాట్లాడా. అప్పుడు తెలిసింది. తనకు వాళ్ల నాన్న, చెల్లెలు అంటే చాలా ఇష్టం అని, వాళ్ల కోసం ఏదైనా చెయ్యాలి అనే తన ఇంటెన్సన్. నాకు తన మీద ప్రేమను ఇంకా పెరిగేలా చేశాయి. రోజులు గడుస్తున్న కొద్దీ నేను అందరితో చాలా క్యాజువల్‌గా సరదాగా ఉండేవాడ్ని.
తన దగ్గర మాత్రం అలా ఉండేవాడ్ని కాదు. తను ఎంతో నెమ్మదిగా ఉంటుంది. తొలి ప్రేమలో కీర్తిరెడ్డిలాగా. నాకు తెలియకుండానే నేను తన దగ్గర చాలా నెమ్మదిగా నడుచుకునేవాడిని. నా ఫ్రెండ్స్‌కి తెలుసు తనంటే నాకు ఇష్టం అని. అలాగే తన ఫ్రెండ్స్‌కు కూడా తెలిసింది నేను తనను ప్రేమిస్తున్నానని. అప్పటినుంచి నాతో మాట్లాడటం మానేసింది. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేసేది కాదు. మెసేజ్ చేస్తే నో రిప్లై. అప్పుడే నాకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. అప్పుడు ఫ్రెండ్స్ అంతా పార్టీ అడిగారు. తనను కూడా పిలిచా, చాలా బ్రతిమాలితే తను వచ్చింది. రాజుభాయ్ మూవీకి, తర్వాత రెస్టారెంట్‌కు అప్పుడే తనతో నేను కొంచెం ఎక్కువ సేపు టైం స్పెండ్ చేసింది. ఆ తర్వాత నేను నా జాబ్ చేసుకుంటూ తనను చూడటానికి డైలీ నా పాత ఆఫీసుకు వెళ్లే వాడిని. అలాగే తను కొన్ని కోర్సులు నేర్చుకోవటానికి అమీర్ పేట్ వచ్చేది.
అక్కడ వేచి చూసే వాడ్ని. ఇబ్బంది పెట్టకూడదని దూరం నుంచే చూసే వాడ్ని. ఒకరోజు తన బస్‌లో వెళ్లి తన హాస్టల్ దగ్గర మాట్లాడా. ‘ నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు’ అని అడిగా. దానికి తను ‘ ఇవన్నీ ఎందుకు. అందరూ ఏదో అనుకుంటారు’ అని చెప్పింది. ‘ నలుగురు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ, నువ్వు అంటే నాకు ఇష్టం’ అని చెప్పా. తను ‘ఇవన్నీ జరగవు’ అని అంది. నేను తనను ఇబ్బంది పెట్టను అని చెప్పా. ఆ తర్వాత కొన్ని నెలలకు తనకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసింది. చాలా ఏడ్చాను. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను నార్మల్ చేయటానికి చాలా ట్రై చేశారు. తను నన్ను పెళ్లికి పిలవదు అనుకున్నా. నాకు మ్యారేజ్ ఇన్విటేషన్ మెయిల్ చేసింది. నా లైఫ్‌లో ఎప్పుడూ ఏడ్చనంతగా ఓ అమ్మాయి కోసం ఏడ్చా. తర్వాత రోజు మ్యారేజ్‌కు రమ్మని నాకు కాల్ చేసింది.
సడెన్‌గా ఏంటిది అని అడిగా. అప్పుడు తను చెప్పింది ‘ సడెన్‌గా కాదు! చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. అతను మా మామయ్య’ అని. ‘‘ నువ్వు నన్ను పెళ్లికి పిలువవు అనుకున్నా’ అని చెప్పా. అప్పుడు తనంది’ నువ్వు నా ఫ్రెండ్‌వి’ అని. ఆ తర్వాత నేను తనకు ప్రపోజ్ చేశా. ఐ లవ్ యూ అని చెప్పా. స్వారీ కూడా. ఐ లవ్‌యూ అని తనతో చెప్పాలనుకున్నా! చెప్పా. అప్పుడు చెప్పటం కరెక్ట్ కాదు. అయినా చెప్పా. ఆ తర్వాత తన మ్యారేజ్‌కు ముందు రోజు వాళ్ల ఇంటికి వెళ్లి విష్ చేసి వచ్చా. అది నేను తనను చివరిసారి చూడటం. తర్వాత ఎప్పుడూ తనను కలవలేదు, మాట్లాడటానికి కూడా ట్రై చేయలేదు.
జీవితంలో మనకోసం కూడా ఒకరు పుడతారని అంటారు. అది నిజం! తన మ్యారేజ్ అయిన ఐదు సంవత్సరాలకు ఒక అమ్మాయి మా ఆఫీసులో జాయిన్ అయ్యింది. తనలాంటి నడవడికతో ఉన్న ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యింది. నేను తనకు చెప్పా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని. తను వాళ్ల ఇంట్లో అడగమంది. వాళ్ల పేరెంట్స్‌ని అడిగి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లంటే నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ లవ్ తర్వాత నా వైఫ్‌తో, ఇప్పుడు నా ఇద్దరు కూతళ్లతో కలిపి మొత్తం నలుగురితో నాలుగు సార్లు లవ్‌లో పడ్డా. ఇప్పుడు నా కూతుళ్ల కన్నా ఎవ్వరూ నాకు అందంగా కనిపించరు.
- కిరణ్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి