పెళ్లికి ఒప్పుకోరు! వాళ్లకి పరువే ముఖ్యం

Sai Kiran Sad Ending Telugu Love Story - Sakshi

అనుకోని అతిధిలా ఒక రాంగ్ నెంబర్ ద్వారా దీప్తి నాకు పరిచయం అయింది. చిన్నతనంలోనే బాధ్యతలు మీదపడి హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న నా ఒంటరి జీవితంలోకి సునామిలా దూసుకువచ్చింది. మా మధ్య ఎప్పుడైతే ప్రేమ చిగురించిందో ఆ క్షణంనుండి నా జీవితం అంతా సంతోషంతో నిండిపోయింది. అప్పటివరకు నన్ను పట్టించుకునేవాళ్లు లేరు. తను వచ్చాక నన్ను ఒక చిన్నపిల్లాడిలా చూసుకుంది.  తనకి నామీద ఉన్న ప్రేమ చూసి ఎన్నిజన్మలైనా నా జీవితంలో తను మాత్రమే ఉండాలనుకున్నాను. తను ఎటైనా వెళ్తుంటే బాధగా అనిపించేది. ఇంటికి వెళ్లడానికి తనని బస్ ఎక్కించడానికి వెళ్లినపుడు కిటికీలోనుంచి తను నాకు వెళ్లొస్తా అని కళ్లతో చెప్తుంటే వెనక్కి వచ్చి ఏడ్చేవాన్ని. 

అంత ప్రేమ ఉండేది మా మధ్యలో. అంత ఆనందంగా సాగుతున్న నా జీవితంలో ఒక రోజు అమ్మ ఫోన్ చేసి పెళ్లిసంబంధం వచ్చింది ఇంటికి రమ్మంది. ఇంతకుముందు చాలాసార్లు పిల్ల నచ్చలేదని చెప్పేవాన్ని. కానీ ఈసారి అమ్మ ‘నేను చెప్పిన అమ్మాయిని చేసుకోకపోతే చనిపోతా’ అంది. ఇది దీప్తికి తెలిస్తే తను తట్టుకోలేదు. కానీ, తనకి అర్థం అయ్యేలా చెప్పాను! తను అర్థం చేసుకుంది. క్రమంగా మాట్లాడటం తగ్గించేసింది. తను నాకు చాలా సార్లు చెప్పేది ‘మా ఫ్యామిలీ కూడా మన పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. పరువే ముఖ్యం వాళ్లకి’ అని. అమ్మని కాదని తనని చేసుకుని అమ్మ ప్రాణం తీయలేను. అమ్మ చెప్పిన అమ్మాయిని చేసుకుని దీప్తి ప్రాణం తీయలేను.

కానీ, తను అర్థం చేసుకుని ఒప్పుకుంది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 25 సంవత్సరాలు కనిపెంచిన అమ్మే నన్ను అర్థంచేసుకోలేదు. 3 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి నన్ను అర్థంచేసుకుంది. నాకోసం పల్లెటూరు నుండి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి ఈరోజు ఒక కార్పోరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. నాకు చాలా గర్వంగా ఉంది. తను నాకు వేసిన శిక్ష తను ఎప్పటికి నాకు కనపడకూడదని. అటు పెళ్లి చేసుకున్న అమ్మాయి చదువు కోసం దూరంగా ఉంది. అయినా నాకు బాధలేదు ఎందుకంటే తన జ్ఞాపకాలన్నీ నాతో ఉన్నాయి. చచ్చేదాక తనే నా ప్రపంచం. తనకోసం చస్తూ బ్రతుకుతున్నాను. మరుజన్మ అంటూ ఉంటే నీ రుణం తీర్చుకుంటా. ఒక్కసారి కనిపించవా నీకు క్షమాపణలు చెప్పాలి.
- సాయి కిరణ్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top