విడిపోయి బ్రతకలేం! అర్థం చేసుకోండి

Love Stories In Telugu : We Cant Live Seperatedly, Bondom - Sakshi

12 ఏళ్ల క్రితం మొదటిసారి తనను చూశాను. అది కూడా వెనుకనుంచి మాత్రమే. క్షణంలో 1000వ వంతు సమయంలోనే తను నచ్చేసింది. మా పక్కింట్లో ఉండే వాళ్ల అక్క ఇంటికి వచ్చింది తను. ఆ రోజు తన ఫేస్‌ చూడలేకపోయా. కానీ, తన గురించి ఆరా తీయటం మొదలుపెట్టా. అలా కొన్ని రోజుల తర్వాత తన ఫొటో చూశాను. అదే తన ఫేస్‌ మొదటిసారి చూడటం. అప్పుడే ఫిక్స్‌ అయ్యా. విచిత్రం ఏంటంటే! ఆ రోజు తను వచ్చింది నా కోసమే అంట. నేను తనను వెనుక నుంచి చూసి ఇష్టపడితే తను నన్ను చూడకముందే ఇష్టపడింది. అందుకే ఆరోజు అక్కడకు వచ్చింది. ఆ విషయం మాకు తెలియడానికి 4 ఏళ్లు పట్టింది. మా ఇంట్లో తెలియడానికి 10 ఏళ్లు పట్టింది. సినిమాటిక్‌గా ప్రేమలో పడ్డామే తప్ప ఎప్పుడూ ప్రపోజ్‌ చేసుకోలేదు. ప్రేమిస్తే చెప్పాలి అంటారు కానీ, చెప్తే కానీ, తెలియకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది అంటాను నేను.

అందుకే ప్రేమిస్తున్నానని చెప్పటం కన్నా.. ప్రేమను ఇచ్చిపుచ్చుకోవటమే మాకు తెలుసు. మాకు ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమ, కోపం అన్నీ ఒక చూపుకే తేలిపోతాయి. వెయ్యేళ్లు మాట్లాడుకునే మాటల్ని ఒక సారి తన చెయ్యి పట్టుకుంటే నాకు తెలిసిపోయేవి. అలా ఉండేది మా కమ్యూనికేషన్‌ 12 ఏళ్ల ప్రయాణంలో తనని ఒకసారి కూడా పేరుతో పిలువ లేదు. తనకి నా పేరు గుర్తుందో లేదో మరి! ఎప్పుడు బొండాం.. బొండాం అని పిలుస్తుండేది. గోదావరిలో పడవ ప్రయాణంలా సాగిపోతున్న మా జీవితంలోకి ఒక పెద్ద సుడిగుండం.. వాళ్ల అమ్మగారు చనిపోవటం. అక్కడినుంచి మొదలయ్యాయి మా కష్టాలు. 

పెళ్లి చేసుకో అని వాళ్ల ఇంట్లో వాళ్లు పెట్టే ఒత్తిడి ఎక్కువైంది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ల ఇంట్లో మా ప్రేమ విషయం తెలిసి గొడవలు పడటం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ, మేము ఎప్పుడో ఫిక్సయి పోయాం. ఏం జరిగినా కలిసే ఉండాలని. కొన్ని రోజులకు మా ఇంట్లో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పుడే తెలిసింది.. ప్రేమ, డబ్బు, సంతోషం కన్నా కులమే గొప్పదని. అయినా వెనక్కు తగ్గలేదు. ఎవరు ఎన్ని మాటలు అన్నా అలాగే ఓర్చుకున్నామే తప్ప ఎదురించలేదు. మేము వెళ్లిపోయి పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా అలా చేయలేదు. వాళ్లకి కూతురు కంటే కులం ఇష్టం.

కానీ, మాకు మా ప్రేమతో పాటు వాళ్ల పేరెంట్స్‌ కూడా కావాలి. ఇదంతా జరిగి రెండేళ్లు అయ్యింది. వాళ్ల కోపంలో కానీ, మా ప్రేమలో కానీ, కొంచెంకూడా మార్పురాలేదు. మా 12 ఏళ్ల ప్రేమ పెద్దరికాన్ని దాటలేకపోయింది. వాళ్ల 25ఏళ్ల ప్రేమ కులం అనే గోడల్ని దాటలేకపోయింది. వాళ్ల కోసం ఆగిపోయాం.. మా కోసం ఒక్క అడుగు వేయలేరా. మేము మా ప్రేమను మర్చిపోవాలి అంటే ముందు మేము మా గతాన్ని మర్చిపోవాలి. ఆ గతంలో మీరు కూడా భాగమే కదా అంటే మిమ్మల్ని కూడా మర్చిపోవాలా? కష్టమే కదా. మిమ్మల్ని ఒప్పిస్తాం. మీరు ఒప్పుకునే వరకు ఎదురు చూస్తాం. మీరు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాం. అంతే కానీ, విడిపోయి మాత్రం బ్రతకలేము అర్థం చేసుకోండి.
పేరులేని అమ్మాయిని ప్రేమించిన..
- బొండాం


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top