ఆమె చెప్పింది అక్షరసత్యం

Kalyan Sad Ending Telugu Love Story - Sakshi

ఓ అమ్మాయి నాకు లోకం అనిపించింది. ఆమెను చూస్తూ చుట్టుప్రక్కల అన్నీ మర్చిపోయేవాడిని. నిద్రరాదు, ఆకలివేయదు! ఒకరకమైన పిచ్చి. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ, మా ఇద్దరిదీ పెళ్లి చేసుకునే వయస్సు కాదు. ఓ రోజు లెటర్‌తో ఆ అమ్మాయి ముందు నిల్చున్నాను. గుండెలనిండా భయం. ఐ లవ్‌ యూ చెప్పి లెటర్‌ ఇచ్చాను. అదే మొదటిసారి ఆ అమ్మాయితో మాట్లాడటం. ఒక వారం కనిపించలేదు. నేను బాగా మనస్తాపం చెందాను. ఓ రోజు వాళ్ల అక్క భర్త నా దగ్గరకు వచ్చాడు. లెటర్‌ చూపించి‘ ఏంటిది?’ అన్నాడు. నేను సైలెంట్‌గా వెళ్లిపోయాను. నాకు చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయి ఇంటి దగ్గరకు వెళ్లాను మాట్లాడటానికి. రాత్రి ఎనిమిది అయ్యింది. చాలా కోపంగా‘ ఏంటిది? నీకు ఇష్టం లేకపోతే నీ నోటితోటే చెప్పొచ్చుగా’ అన్నాను. మేము కలిసి బ్రతకటం కుదరదని చెప్పింది. ఆ తర్వాత నేను మా అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాను.

చాలా రోజుల తర్వాత ఓ రోజు వేరే పని మీద తను మా ఊరొచ్చింది. నాకు ఎదురై హాయ్‌ చెప్పి వెళ్లిపోయింది. అప్పుడు నాకు మేము విడిపోయిన రోజు తను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘‘ మన జీవితం మనం నిర్ణయం తీసుకునేది కాదు. దేవుడు నిర్ణయించాలి, మన తల్లిదండ్రులు నిర్ణయించాలి. నేను ఈ రెండు విషయాలను బాగా నమ్ముతాను. ప్రేమించటం తప్పుకాదు. మన ప్రేమ మనల్ని ప్రేమించే తల్లిదండ్రులకు నచ్చాలి. అప్పుడే మన పెళ్లికి వాళ్లు సమ్మతిస్తారు. నువ్వంటే నాకు ఇష్టమే.’’  ఆరోజు అలా చెప్పి వెళ్లిపోయింది. ఆమె చాలా తెలివైనదే. తనకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజు తను చెప్పింది అక్షరసత్యం. ప్రేమంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు.. రెండు కుటుంబాలకు సంబంధించింది.
- కళ్యాణ్


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top