నన్ను కాదని పెళ్లైన వ్యక్తి మాయలో పడింది

Breakup Love Stories In Telugu : Nani Sad Love - Sakshi

నేను హైదరాబాద్‌లో ఓ ఇంట్లో అద్దెకి ఉండేవాన్ని. ఆ ఇంట్లో నేను పై పోర్షన్‌లో ఉండేవాన్ని.. క్రింద ఉన్న ఓ పోర్షన్‌లో ఓ అమ్మాయి ఉండేది. తను అప్పుడే ఎంబీఏ జాయిన్‌ అయ్యింది. నేను కాంట్రాక్టు వర్క్ మీద బాన్సువాడకి పోయాను. అప్పడు తను చేసిన కాల్‌తో మా మధ్య పరిచయం ఏర్పడింది. చిన్న పరిచయం కాస్తా స్నేహంగా మారింది. మొదట్లో నేను వద్దనుకున్నా కానీ, ఆమె చూపించే ప్రేమకి నేను కూడా పడిపోయాను. ఈ లోపు ఎలా మారిందో తెలియదు కానీ స్నేహం కాస్తా నా వైపు నుంచి ప్రేమగా మారింది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతగా అంటే తెలియకుండానే రోజులు గడిచిపోయాయి. మా కబుర్లకు గంటలు కూడా సెకన్లలా గడిచిపోయేవి. తనకి దేవాలయాలు అంటే చాలా ఇష్టం! నన్ను అన్ని టెంపుల్స్‌కి తిప్పేది. నాతో చేయించని పూజలు లేవు. ఒకరిని విడిచి ఒకరం ఉండలేని అనుబంధం మా మధ్య ఏర్పడింది. తెలియకుండానే ఒకరంటే ఒకరికి ప్రాణమైపోయాం. ఏ దేవుడు మమ్మల్ని విడదీయలేడు అనుకున్నా. నా రోజు తన మాటతోనే మొదలవుతుంది.. ముగుస్తుంది.

ఎంత బిజీగా ఉన్నా.. నాకు ఐ లవ్‌ యూ, గుడ్ నైట్ చెప్పనిదే పడుకునేది కాదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకుందామని చాలా సార్లు అనుకున్నాం. ఒకసారి టెంపుల్‌కి వెళ్లాం. కానీ, వేరే కారణం వల్ల తిరిగి వచ్చేశాము. నా ఫోన్ కలువకుంటే తను మా ఫ్రెండ్స్‌కి చేసేది. అంతగా ఇష్టపడేది. తను మా ఇంట్లో వాళ్లతో.. మా బంధువులందరితో మాట్లాడేది. నన్నే పెళ్లి చేసుకుంటానని అందరికీ చెప్పేది. ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అలానే దాచుకున్నాను. ఎంగేజ్మెంట్ అయ్యాక వేరే అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటానని తనే అన్నది. అవన్నీ మరచిపోని అనుభూతులు. తన ఎంబీఏ కంప్లీట్ అయ్యాక కొన్ని రోజులకి తనకు జాబ్ వచ్చింది. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత జాబ్‌ చేయటం ఇష్టం లేదంది. ‘మొదట్లో ఎక్కడైనా అలానే ఉంటది’ అని చెప్పి నేనే పంపించాను. అదే నేను చేసిన మిస్టేక్.. తన మీద నమ్మకం చాలా ఉండేది. ఆఫీస్‌కు పోయినప్పటి నుండి ఇంటికి వెళ్ళేదాక ఎప్పుడు టైం దొరికినా కాల్ చేసేది. ప్రశాంతంగా సాగిపోతున్న నా ప్రేమ కథలోకి వచ్చిందో ప్రమాదం. ఆఫీస్‌లో పని చేస్తున్న ఓ పెళ్లైన వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడింది. 

ఆ అమ్మాయి అంత వయస్సు ఉన్న కూతురు.. ఒక అబ్బాయి ఉన్నాడు. కానీ, అతడి ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండదు. అదే తనకి కలిసి వచ్చింది. వాళ్ల మధ్య ఏ బంధం లేదని తను చెబితే నమ్మాను. నేను కూడా అసలు అలా అనుకోలేదు కొన్ని రోజులు. కానీ తను ఫస్ట్‌లో తండ్రి లాంటి వ్యక్తి అంది. పోను పోనూ వాళ్ల మధ్య బంధం దగ్గర అవుతూ.. మా మధ్య బంధం దూరం అవుతూ వచ్చింది. నేను ఫోన్ చేసిన ప్రతీసారి కాల్ వెయిటింగ్ అని వచ్చేది. అడిగితే అమ్మ అనేది. నా కాల్ కట్ చేసి ఆఫీస్‌లో బిజీగా ఉన్నా అని మెసేజ్ పెట్టడం.. ఆఫీస్ అయ్యాక అతడి కార్‌లో పోతూ మెట్రోలో పోతున్నా అని చెప్పేది. ఆ వ్యక్తి ఇల్లు ఆఫీస్ దగ్గరే.. అయినా ఆమె కోసం ఎక్కడో దూరంగా వున్న తన ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యటం చేసేవాడు. నేను అడిగితే మెట్రోలో పోతున్నా అనటం నాకు అనుమానాన్ని తెచ్చాయి.

కొన్ని పరిణామాలతో నాలో అనుమానాలు బలపడ్డాయి. తను నాతో ఉన్నా కూడా ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడేది. నెంబర్‌ చూపించమంటే తీసేసేది. ఎందుకంటే వేరే ఫ్రెండ్ అని చెప్పేది. నన్ను కాదని ఆ వ్యక్తితో సినిమాలకి షాపింగ్‌లకి పోవడం నాలో భరించలేని బాధని తెచ్చాయి. ఓసారి ఇద్దరూ నా కంట పడ్డారు. సరే అని వదిలేసాను. తర్వాత అడిగాను ‘మీరిద్దరూ ఆఫీస్‌లో ఉండేటోళ్లు కదా మళ్లీ ఎందుకు అక్కడ ఆగటం?’ అని. తనకు చాలా సార్లు చెప్పి చూశాను. కానీ, తను వినలేదు. ‘అలా ఎందుకు చేస్తున్నావ్?’ అని అడగటమే నేను చేసిన తప్పు. ఆ వెంటనే నన్ను దూరం పెట్టడం స్టార్ట్‌ చేసింది.

నా నెంబర్‌ కూడా బ్లాక్ చేసింది. అసలు నేనేమి తప్పు చేశానో నాకే అర్థమవ్వట్లే.. అసలు తను ఎందుకు అలా చేస్తుందో, తను చేసేది తప్పని తనకి ఎందుకు అర్దమవ్వట్లే. ఆ వ్యక్తికి అయినా అది తప్పని అనిపించట్లేదా? తను ఆ వ్యక్తి మాయలో పడటం నాకు ఇంకా బాధగా ఉంది. భరించరాని నరకంలా ఉంది. ప్రేమంటే స్థాయి, అంతస్తులు చూసి లెక్కలేసుకోవడం కాదు. ఏమీ లేకున్నా, ఏమీ ఆశించకుండా నేనున్నాను అనే భరోసా ఇవ్వడం. కానీ, నీకోసం పడే ఈ బాధ కూడా నాకు మధురంగానే ఉంది. తనని వదిలి వస్తాను అని హామీ ఇస్తానంటే జీవితాంతం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. లేదంటే ఇక నువ్విచ్చిన ఈ మధురస్మృతులతోనే జీవితం గడిపేస్తాను..
- నీ నాని

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top