అన్నా! నువ్వు మోస పోయావ్‌

Breakup Love Stories In Telugu : Basha Sad Love, Vijayawada - Sakshi

మాది చాలా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. నాన్నది చిన్న ఉద్యోగం. అమ్మ బట్టలు కుట్టేది. నేను డిప్లమా జాయిన్‌ అయ్యాను. అప్పుడే మా ఇంటి ఎదురింట్లో బసంతిని చూశాను. కొత్తగా వచ్చారు వాళ్లు. తను స్కూల్‌ చదువుతోంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం. వాళ్ల అమ్మ వార్డు మెంబర్‌. ఒకటే కాలనీ అవ్వటంతో పరిచయం ఏర్పడింది. తన మాటలు నన్ను బాగా ఇంప్రెస్‌ చేశాయి. ఆ వయసుకు అంత మెచ్యూరిటీ ఉండటం అసాధ్యం. అంత తెలివి గలది. నాలో ప్రేమ చిగురించింది. నా చదువు పాడుచేసుకోవటం నాకు ఇష్టంలేదు. అందుకే ఏమీ అనలేదు. కానీ, నా నెంబర్‌ తను సంపాదించింది. నాకు కాల్స్‌ చేసి ఏడిపించేది. కొంతకాలానికి నాకు దొరకిపోయింది. ఇదిలా ఉండగా అప్పుడే మా ఇంట్లో ఒక కష్టం వచ్చింది. కుటుంబం అంతా కృంగిపోయాం. అప్పుడు తన ఫోన్‌ వచ్చింది. నేను మూడిగా మాట్లాడేసరికి ‘ఏమైంది బంగారం’ అని అడిగింది. ఒక్కసారిగా కంగు తిన్నాను. ఎందుకలా అన్నావని అడిగితే అనకూడదా అని అంది.  నేను ఫిక్స్‌ అయ్యా! తర్వాత కొద్దిరోజులకు ప్రపోజ్‌ చేశా. అప్పుడు తను టెన్త్‌ క్లాస్‌. తనను డిస్ట్రబ్‌ చేయటం ఇష్టంలేక క్యాజువల్‌గా ఉన్నా.

కానీ, తనే నాకు ఫోన్‌ చేసి సడెన్‌గా ఓకే చెప్పింది. అలా మొదలైంది మా ప్రేమ. డాక్టర్‌ అవ్వాలని వాళ్ల నాన్న కోరిక. చాలా కష్టపడి చదివింది. ఆరు నెలల తర్వాత మా మధ్య పెద్ద గొడవ జరిగింది! తప్పు నాదే. ఆరునెలలు సారీ చెబుతూనే ఉన్నా తను పట్టించుకోలేదు. తనకు ఎక్షామ్స్‌ దగ్గర పడేసరికి నేను డిస్ట్రబ్‌ చేయలేదు. డెంటల్‌ డాక్టర్‌గా సీట్‌ వచ్చింది. అప్పటినుంచి తను నాతో మాట్లాడటం మొదలుపెట్టింది.  అప్పుడే నేను డిప్లమా కంప్లీట్‌ చేశా. చిన్న ఉద్యోగం. తను ఇది సరిపోదు అంది. కష్టపడ్డాను. కొంచెం మంచి ఉద్యోగం సంపాదించా. కానీ, ఇంకా ఏదో కావాలి. కలవారి కుటుంబం వాళ్లది. బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా మంచి ఉద్యోగం ఉంటే ఒప్పించగలను అంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేశా. తన బీడీఎస్‌ కూడా అయిపోవచ్చింది. నాకు ఉద్యోగం రాలేదు. ఇంతలో తను మాట్లాడటం మానేసింది. ఏంటి అని అడిగితే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పింది.

‘అదేంటి సడెన్‌గా’ అని అడిగాను. ‘నీ గురించి ఇంట్లో చెప్పాను ఒప్పుకోలేదు’ అంది. నా కోసం పోరాడుతుంది అనుకున్నా. కానీ, ఇంట్లో వాళ్లను కష్టపెట్టి పెళ్లిచేసుకోవటం ఇద్దరికీ ఇష్టంలేదు. నేను నీ పెళ్లి వరకుపోరాడుతా అన్నా. తను బదులు చెప్పలేదు. నా ప్రయత్నం నేను మానలేదు. ఇంతలో తన ఫ్రెండ్‌ ఫోన్‌ చేసింది. ‘అన్నా! నువ్వు మోస పోయావ్‌ అన్నా’ అంది. ‘ఏమైంది’ అని అడిగా. ‘తను మా క్లాస్‌లో ఇంకో అబ్బాయిని ప్రేమిస్తోంది. అందుకే నిన్ను వదిలేసింది’ అని చెప్పింది. నేను నమ్మలేదు. అబద్దం చెబుతుందేమోనని అనుకున్నా. కానీ, నిజం తెలియాలంటే సాయంత్రం కాలేజ్‌ దగ్గరకు రమ్మంది. సరే అని వెళ్లాను. తను చెప్పింది. నిజమే తను ఇంకో అబ్బాయితో మాట్లాడుతోంది. నేనేమీ అనలేదు. ‘రా! బైక్‌ ఎక్కు, వెళదాం’ అన్నాను. ఎప్పుడూ నా బైక్‌ ఎక్కే అమ్మాయి వాళ్ల నాన్న వస్తున్నారని చెప్పింది. సరే అని నేను ఎదురుచూశా. ఆ అబ్బాయి బస్‌ ఎక్కిన తర్వాత తను కూడా వేరే బస్‌ ఎక్కి వెళ్లిపోయింది.

ఏమిటిది అంటూ ఫోన్‌ చేశా. ‘నాన్న ఇంకో బస్‌ స్టాప్‌లో దిగమన్నారు’  అని పెట్టేసింది. బస్‌ను ఫాలో అయ్యాను. నా మీద నాకే అసహ్యం వేసింది. నేనేం చేస్తున్నానా అని. వెంటనే ఫాలో అవ్వటం మానేసి ఇంటికి వెళ్లిపోయా. తను నిజమే చెబుతుందని నాకు నమ్మకం. ఇంటి దగ్గర వేయిట్‌ చేశా. తను ఆటోలో దిగింది. ఫోన్‌ చేశా! డాడీ వేరే చోట దించి వెళ్లిపోయారని చెప్పింది. అప్పుడర్థమైంది నేనెంత మోసపోయానో. ప్రేమ చంపుకోలేక బ్రతిమాలాను. విషయం నాకు తెలుసని మాత్రం చెప్పలేదు. రెండు నెలల తర్వాత కోపం వచ్చి అడిగేశాను. తను వేరే వ్యక్తిని ప్రేమించటం నిజమేనని ఒప్పుకుంది. తప్పుచేయోద్దని బ్రతిమాలాను. ఈ విషయం గురించి దెప్పిపొడవనని ఒట్టుకూడా వేశాను. అయినా కూడా తను మారలేదు. తను నాకిచ్చిన బహుమతులన్ని తిరిగిచ్చేశాను. కానీ, తనను మాత్రం ఇచ్చేయలేకపోయాను.

తను అంతలా మోసం చేసినా నేను వదులుకోలేకపోయా. నా ప్రేమ అలాంటిది. చంపేద్దామన్నంత కోపం. తనకేమైనా అయితే తట్టుకోలేను. అందుకే డాక్టర్స్‌ బ్లేడ్‌ తీసుకుని తన క్లీనిక్‌కు వెళ్లి నా చెయ్యి కోసుకున్నా. తను భయపడి నన్నే పెళ్లి చేసుకుంటానంది. తను ఆ మాట చెబితే అందులో భయం మాత్రమే కనిపించింది, ప్రేమలేదు. అయినా తన మనసు మారుతుందని ఎదురు చూశాను. మళ్లీ రొటీన్‌. ఆమెను ప్రేమించిన అబ్బాయి నా విషయం తెలిసి, నాకు క్షమాపణ చెప్పి తప్పుకున్నాడు. అయినా తను మారలేదు. నాకు ప్రతిక్షణం నరకంలా ఉంది. నా సమయమంతా తనను బ్రతిమాలుకుంటూ నా ప్రేమ నిరూపించుకోవటానికే సరిపోయింది. ఈ విషయాలన్నీ చెప్పి తన పరువు తీయలేక ఎవ్వరికీ చెప్పలేదు. ఎవర్నీ బాధపెట్టడం ఇష్టంలేక. ఫోన్‌ చేయటం మానేశాను. విదేశంలో జాబ్‌ వచ్చింది. ఇప్పుడైనా నా గురించి ఆలోచిస్తుందేమోనని ఫోన్‌ చేశాను.

వాళ్ల నాన్నను ఇంటికి పంపి వార్నింగ్‌ ఇచ్చింది. పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ​ వల్ల మా ఇంట్లో వాళ్లు భయపడ్డారు. తను తిరిగి రాదని నాకు అర్థం అయ్యింది. ఇప్పుడు తన పెళ్లి అయిపోయింది. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా ఏదో ఒక జ్ఞాపకం నన్ను తొలిచివేస్తోంది. ఎవరికీ చెప్పుకోలేను. చెప్పి బాధపెట్టలేను. ప్రతి క్షణం తనతో నా బంధం ముడిపడి ఉంది. ప్రతిక్షణం ఈ టైంలో తను ఏం చేసేది, ఏం చెప్పేది, ఎలా మాట్లాడేది అని గుర్తుకువచ్చేవి. పది సంవత్సరాలు ప్రేమించుకున్నాం కదా!.. కాదు, కాదు ప్రేమించాను కదా. తను నన్ను ఎందుకు వదలి వెళ్లిందో అర్థం కావటం లేదు. ఈ బాధనుంచి ఆ దేవుడు నన్ను త్వరగా బయటకు తేవాలని ప్రార్థిస్తున్నాను. సహనం అవధి దాటితే ప్రాణానికి ముప్పు అని తెలుసు. మా ఇంటి పరిస్థితులు నా చెల్లి పెళ్లి నాకు అడ్డుకాకపోతే ఇప్పుడు నా ఈ కథ తను పంపి ఉండేది. ఆ పోస్ట్‌ని నా ఆత్మ చదివి ఉండేది. 
- బాషా, విజయవాడ


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top