ప్లీజ్‌ బిట్టూ నన్ను వదిలేయ్‌, మర్చిపో!

Bittu Sad Ending Telugu Love Story - Sakshi

బీటెక్‌ చదవటానికి తొమ్మిదేళ్ల క్రితం నేను హైదరాబాద్‌కు వచ్చాను. గట్కేసర్‌ దగ్గరలోని బోగారం దగ్గర ఉన్న ఓ కాలేజీలో జాయిన్‌ అయ్యాను. నాకు ఆ ప్రదేశాలు కొత్త! నేను మొదటిసారి మా పెదనాన్న ఇంటికి హైదరబాద్‌ వచ్చాను. అప్పుడు ఆయనతో కలిసి బిర్లామందిర్‌, ట్యాంక్‌ బండ్‌, సాలర్జంగ్‌ మ్యూజియం వంటివి చూశాను. అలా చాలా రోజుల తర్వాత మళ్లీ చదువు కోసం హైదరాబాద్‌ రావాల్సి వచ్చింది. దీంతో అన్ని ప్రదేశాలు కొత్తగా అన్పిస్తున్నాయి. ఓ రోజు కాలేజ్‌ అయిపోయిన తర్వాత షేర్‌ ఆటో పట్టుకుని రూముకు బయలుదేరాను. గట్కేసర్‌ రైల్వేగేట్‌ దగ్గర కొత్తగా పరిచయమైన ఓ స్నేహితుడ్ని కలిశాను. అతడి ఫోన్‌ను తీసుకుని నా ఫోన్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చాను. తర్వాత అతడి నెంబర్‌ సేవ్‌ చేసుకుని, అందులో ఫీడ్‌ అయిన నా ఫోన్‌ నెంబర్‌ను డిలేట్‌ చేశాను. ఈ విషయాలేవీ ఆ స్నేహితుడికి తెలియదు. నేను నారాయణగూడలోని నా రూమ్‌కు రాగానే ఆ నెంబర్‌కు ఫోన్‌ చేశాను.

ఓ యువతి ఫోన్‌ తీసింది! మాట్లాడేది ఎవరని అడిగింది. బిట్టుగా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నేను ఆమెతో స్నేహం చేయాలని ఎంత ప్రయత్నించినా తను సరిగా రెస్పాండ్‌ అయ్యేది కాదు. రెండు రోజుల తర్వాత తను నా గురించి వివరాలు అడిగింది. నిజాయితీగా నా వివరాలన్నీ చెప్పాను. ఆ తర్వాత తను నా వయస్సు గురించి అడగటం మొదలుపెట్టింది. మొదట చెప్పలేదు! ఫోన్‌ చేసిన ప్రతిసారి అడుగుతుంటే వయస్సు చెప్పాను. తను నాకంటే వయస్సులో పెద్దది అందుకే సచిన్‌ దంపతుల కథ చెప్పేసరికి స్నేహం చేయటానికి ఒప్పుకుంది. దాదాపు రెండేళ్లు మేము స్నేహంగా ఉన్నాం. 2012లో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ చదువుతున్నపుడు తను నాతో కాంటాక్ట్‌లో లేదు.

రెండు నెలల తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. అప్పటినుంచి తన గురించి ఆలోచించటం మానేశాను. అప్పుడు నేను కూకట్‌పల్లిలోని మా అక్కవాళ్ల  ఇంట్లో ఉండటం ప్రారంభించాను. మా అక్క కొత్తగా పెళ్లి చేసుకుని హైదరాబాద్‌ వచ్చేసింది. దీంతో తనే నా అవసరాలు చూసుకునేది. అందుకే నేను 80 కిలోమీటర్లు అప్‌ అండ్‌ డౌన్‌ చేసేవాడిని. ఓ రోజు ఓ అన్‌నౌన్‌ నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ చేశాను. ‘‘బిట్టు ఎలా ఉన్నావు?’’ అని వినిపించింది ఆవతలి వైపునుంచి. నేను ఇదివరకు విన్న గొంతులా అనిపించింది. తనే మళ్లీ ఫోన్‌ చేసిందని అర్థమైంది. నేనో ఫ్రెండ్‌లాగే ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాను. ‘నువ్వు నన్ను మర్చిపోయావా?’ అని అడిగింది తను. నేను లేదని చెప్పాను.

అలా మళ్లీ మా మధ్య ఫోన్‌ కాల్స్‌ పెరిగాయి. కొద్దిరోజులకు నేను తనకు ప్రపోజ్‌ చేశాను. తను నా ప్రేమను అంగీకరించింది. ఒకరినొకరం భార్యాభర్తలుగా పిలుచుకునేవాళ్లం. మేము మొదటిసారి కలుసుకున్న రోజు నాకు గుర్తుంది. ఆ రోజు మేమిద్దం ట్యాంక్‌ బండ్‌ దగ్గర కలుసుకున్నాం. ఆ రోజు రాఖీ పౌర్ణమని మా అక్కకు స్వీట్లు కొనివ్వమని 110 రూపాయలు ఇచ్చింది. మేమిద్దరం తరచుగా కలుసుకోకపోయినా మా మధ్య బంధం చాలా గట్టిగా ఉండేది. బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌లో ఉన్నపుడు ఓ రోజు తను నాకు మెసేజ్‌ చేసింది ‘‘ ప్లీజ్‌ బిట్టూ నన్ను వదిలేయ్‌, మర్చిపో! ’’ అని. నా కలలన్నీ కల్లలయ్యాయి. దీంతో నేను డిప్రెషన్‌కు గురయ్యాను.

అక్కడ ఉండలేక మా ఊరు వెళ్లిపోయాను. తను నాతో మాట్లాడటం  పూర్తిగా మానేసింది. నేను తనను కలవటానికి మళ్లీ సిటీకి వచ్చేశాను. తను నన్ను కలవటానికి ఇష్టపడలేదు. నన్ను దూరం పెట్టొద్దని ప్రాథేయపడ్డాను. సరిగా తిండి, నీళ్లు, నిద్రలేక నేను రెండు నెలలు కోమాలోకి వెళ్లిపోయాను. తర్వాత కోలుకున్నాను. మెల్లగా బ్యాక్‌ లాగ్స్‌ పూర్తిచేశాను. రెండేళ్ల క్రితమే తను పెళ్లి చేసుకుంది. అది తెలిసి నేను సంతోషపడ్డాను. ప్రేమ పేరుతో ఆమె నా మనసును గాయపరిచింది, విలువైన నా సమయాన్ని వృథా చేసింది. నేనిప్పుడు సింగిల్‌గా ఉన్నాను. నో లవర్‌! నో పేయిన్‌!
- బిట్టు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top