మళ్లీ జన్మంటూ ఉంటే నీ కోసమే..

Bava Maradal Breakup Love Story in Telugu, Sudhaakar Reddy from Warangal - Sakshi

మాది ఉమ్మడి కుటుంబం. తను మా మేనమామ కూతురు. మాకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేము. నేను హైదరబాద్‌లో జాబ్‌ చేస్తున్నపుడు తను వరంగల్‌లోనే ఉండేది. ప్రతి ఆదివారం మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లే వాడిని. మా ఫ్యామిలీలో అందరికి తెలుసు మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం అని. అయినా కూడా మళ్లీ ఒకసారి మా అమ్మ నాన్నతో ఒక మాట చెప్పా! తను వాళ్ల అమ్మా నాన్నకు ఓ మాట చెప్పింది. నేను కూడా వాళ్లకు చెప్పాను, మా అమ్మానాన్నలతో చెప్పించాను. అందరం మాట్లాడుకున్నాం. కానీ, తనను నాకు ఇచ్చి పెళ్లి చేయటం ఒక్కరికి కూడా ఇష్టం లేదు. అది నా మరదలికి కూడా తెలుసు. అందరి ముందు మాకు మాట ఇచ్చారు.. 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తాం అన్నారు. ఆ రోజునుంచి మమ్మల్ని ఎప్పుడూ కలవనివ్వలేదు. అయినా ఎదురుచూశాను. అందర్ని మళ్లీ ఒకసారి అడిగాను. తను కూడా నన్ను చూడకుండా ఉండలేకపోయింది.

తన స్నేహితురాలితో కాల్‌ చేయించింది. తన పరిస్థితి వివరించి చెప్పారు. ఓ రోజు సడెన్‌గా తనతో ఫోన్‌ చేయించి నాకు పెళ్లి వద్దు అని చెప్పించారు వాళ్ల తల్లిదండ్రులు. చాలా బాధపడ్డాం. చాలా సార్లు మా ఫ్యామిలీ మెంబర్స్‌తో అడిగించాను. తనని కూడా ఒకసారి కలిసి మాట్లాడాలని కోరాను కానీ ఒప్పుకోలేదు. పారిపోదాం అనుకున్నాం. ‘ ఇప్పుడు మనల్ని మనవాళ్లు అర్థం చేసుకోలేదు. కానీ, మళ్లీ ఏదో రోజు వాళ్లు అర్థం చేసుకుంటారు. వాళ్లు ఎప్పటికీ అలాగే ఉండరు’ అని తను చెప్పింది. అలా పారిపోయే ధైర్యం చేయకపోవటమే నేను చేసిన తప్పు. అప్పటినుంచి మా మధ్య మాటలు లేవు. పెద్దవాళ్లు కూడా మాట్లాడుకోవటం మానేశారు. అందరమూ బంధువులమే మాలో మేము చాలా బాధపడ్డాం. తనను చాలా ఇబ్బంది పెట్టారు. నా వల్ల తనను తిట్టడం, కొట్టడం, అన్నం పెట్టకపోవటం చేసేవాళ్లు. నేను కూడా చాలా నరకం అనుభవించాను.

నాతో మాట్లాడ్డం వల్ల వాళ్లు ఇంత ఘోరంగా బిహేవ్‌ చేశారు. మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేస్తే వాళ్లే వచ్చి అడుగుతారు అన్నారు. ఎందుకంటే వాళ్ల నాన్న మా అమ్మకు తమ్ముడు కదా! వాడే వచ్చి అడిగి పిల్లను ఇస్తాడులే అన్నారు. కానీ, పెద్దవాళ్ల పట్టింపులతో మా జీవితాలను మేము కోల్పోయాం. ఇప్పటికి అది జరిగి 10 సంవత్సరాలు అయింది. తనకు కొన్ని విషయాలు తెలుసు, కొన్ని తర్వాత తెలుసుకుంది. కానీ, మాకు వేరే వాళ్లతో పెళ్లిళ్లు అయిపోయాయి. అప్పుడప్పుడు మా ఫ్యామిలీ ఫంక్షన్లలో ఇద్దరం కలుస్తుంటాము. కానీ, కంటి చూపులే మా మాటలు. సొంతవాళ్ల కోసం విడిపోయాం. మళ్లీ జన్మంటూ ఉంటే నీ కోసమే జన్మించి నిన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ బావ. 
నీ స్వీట్‌ మెమోరీస్‌ ఇంకా అలాగే గుర్తున్నాయి... నా ప్రాణమా! 
- సుధాకర్‌ రెడ్డి, వరంగల్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top