ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతం!

TSRTC plans to lease out lands to tide over losses - Sakshi

ఆదాయం పెంపు పేరుతో భూములు లీజుకు..!

మూడున్నర ఎకరాల అప్పగింతకు సర్వం సిద్ధం

‘ప్రైవేటు’ వైపు యాజమాన్యం అడుగులు

ఆందోళనబాటలో కార్మిక సంఘాలు

ఆర్టీసీ సంస్థ తన ఆధీనంలోని భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ఫైల్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కరీంనగర్‌లోని జోనల్‌ వర్క్‌షాప్‌ వద్ద మూడున్నర ఎకరాల స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆదాయం పెంచుకునేందుకే స్థలాలను లీజుకు ఇస్తున్నామని యాజమాన్యం చెబుతున్నా.. ఈ నిర్ణయం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని, సంస్థను ప్రైవేటుపరం చేయడంలో భాగమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మంకమ్మతోట(కరీంనగర్‌) : ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పెంచుకునేందుకు క్రమంగా ప్రైవేటువైపు అడుగులు వేస్తోం ది. ఇందులో భాగంగానే సంస్థ అభివృద్ధికి అంటూ.. భూములను లీజుకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ అవసరాల మేరకు భూములన్నింటిని ప్రైవేటు కంపెనీలు, సంస్థలకు అప్పగించి కమర్షియల్‌ కాంప్లెక్స్, షాపింగ్‌మాల్స్, ఐమాక్స్‌ థియేటర్లు, సినిమాహాళ్లు, రెస్టారెట్లు, ఫంక్షన్‌హాల్స్‌ నిర్మింపచేయాలని ప్రయత్నం చేస్తోంది. గ్యారే జీ, బస్‌స్టాపులు, వర్క్‌షాప్, టైర్‌వర్క్స్‌ వంటి సంస్థకు ఉపయోగపడే వాటిని ఏర్పాటు చేయకపోగా.. ప్రైవేటుకే పూర్తిగా అప్పగించాలనే నిర్ణయాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఆర్టీసీకి అదనంగా ఆదాయం వస్తుందని యాజమాన్యం చెబుతున్నప్పటికీ.. లీజు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ భూములు సంస్థకు దక్కుతాయా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రీజియన్‌లో ఆర్టీసీకి  చెందిన చాలా భూములన్నిఇప్పటికే ప్రైవేటుకు ధారాదత్తం అయ్యాయి. మిగిలిన వాటిలో ఇటీవల కొన్నిటికి అనుమతి ఇవ్వగా.. మరికొన్నింటికి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ భూములు సంస్థకోసం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉన్నా.. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం లాభాలు,  అభివృద్ధి పేరుతో పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ధారపోయడానికే ఈ నిర్ణయం తీసుకుంటోందని కార్మికులు పేర్కొంటున్నారు.

మూడున్నర ఎకరాలు ఇచ్చేందుకు..
నగరంలోని జోనల్‌ వర్క్‌షాప్‌ వెనుక సంస్థకు 50ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని వర్క్‌షాప్, రీటైరింగ్‌ వర్క్‌షాప్, స్క్రాప్‌ బస్సులు నిలుపుకోవడానికి వినియోగిస్తున్నారు. అయితే ఇందులో మూడున్నర ఎకరాల్లో హోటల్, మాల్స్, థియేటర్‌ నిర్మించుకోవడానికి గత అక్టోబర్‌లో టెండర్లు ఆహ్వానించింది. అయితే యాజమాన్యం విధించిన నిబంధనలకు లోబడి టెండర్‌ దాఖలు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదని తెల్సింది. ప్రస్తుతం వర్క్‌షాప్‌ వెనుక గల స్థలాన్ని చెట్లు నరికివేసి చదును చేయిస్తున్నారు అధికారులు. స్క్రాప్‌ బస్సులను నిలుపుకోవడానికే చదును చేస్తున్నామని చెబుతన్నప్పకీ.. పెద్దమొత్తంలో స్థలాన్ని లీజుకు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికే సిద్ధం చేస్తున్నారని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. జోనల్‌ వర్క్‌షాప్‌ను పూర్తిగా ఇక్కడి నుండి తరలించాలనే ఉద్దేశంతోనే ఉద్యోగుల నియామకం చేపట్టడం లేదని, మరికొన్ని రోజుల్లో వర్క్‌షాప్‌ మూసేయడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో కరీంనగర్‌–2 డిపో తరలించే అవకాశాలూ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. డిపో తరలిస్తే.. ఆ స్థలాన్నీ లీజుకిచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకనుగుణంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని స్థలాలు లీజుకు
నగరంలోని కొన్ని స్థలాలను యాజమాన్యం ఇప్పటికే లీజుకు ఇచ్చింది. కరీంనగర్‌ –2 డిపో పక్కనగల స్థలాన్ని 99 ఏళ్లకుగాను లీజుకు ఇచ్చింది. ఇందులో మల్టీప్లెక్స్‌ నిర్మించారు. జగిత్యాలలోని స్థలాలను మూడేళ్లక్రితమే లీజుకిచ్చారు. ప్రస్తుతం నగరంలోని బస్‌స్టేషన్‌ ఆవరణలో వర్క్‌షాప్‌ వద్ద  ఆర్టీసీ భూములున్నాయి. వీటిని కూడా లీజుకు ఇచ్చేందుకు శరవేగంగా ఫైల్‌ కదులుతున్నట్లు సమాచారం.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top