లక్షకి చేరువలో..

WHO warns governments this is not a drill as coronavirus - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్‌వో

బీజింగ్‌: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇంచుమించుగా లక్షకి చేరుకుంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రెయేసస్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘ఇదేమీ డ్రిల్‌ కాదు. వెనకడుగు వేసే విషయం కాదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అంశం అసలే కాదు.

ఈ తరహా ముప్పు ఎదుర్కోవడానికి దశాబ్దాలుగా దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వాటి అమలుకు సమయం వచ్చింది’’అని అన్నారు. అమెరికా, యూరప్‌లలో కూడా కరోనా మృతులు పెరగడం, కేసులు పెరిగిపోవడం చూస్తే ఆ దేశాలేవీ సన్నద్ధంగా లేవన్న విషయం అవగతమవుతోందని అన్నారు. ధనిక, పేద అన్న దేశాల తేడా లేకుండా కరోనా వైరస్‌ ఎదుర్కోవడం అన్ని దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ దేశాలు చికిత్స కంటే నివారణే మార్గం అన్నది తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయొద్దని గట్టిగా చెప్పారు.  

చదువుకు సోకిన వైరస్‌  
కరోనా వైరస్‌ ప్రభావంతో మొత్తంగా 13 దేశ్లాలో 29 కోట్ల మంది పిల్లలు బడికి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. పిల్లలకి వైరస్‌ సోకకుండా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో కోట్లాదిమంది చదువులపై ప్రభావం చూపించిందని తెలిపింది. ఆరోగ్యపరంగా ఇలా బడికి సెలవులు ఇవ్వడం సాధారణమే అయినా ఎక్కువ కాలం కొనసాగితే విద్యాహక్కుకి భంగం వాటిల్లుతుందని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఆండ్రీ అజౌలే అన్నారు.  

భారత్‌లో 31కి చేరుకున్న కేసులు
ఢిల్లీలో మరొకరికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో 16 మంది ఇటలీ టూరిస్టుల సహా కరోనా కేసుల సంఖ్య 31కి చేరుకుంది. థాయ్‌లాండ్, మలేసియాల నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌  సోకిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ రోగిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు సోనియా లేఖ
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు.   

వాఘా సరిహద్దులో రిట్రీట్‌ సందర్శనకు నో
భారత్, పాకిస్తాన్‌ వాఘా సరిహద్దుల్లో ప్రతీరోజూ సాయంత్రం సరిహద్దు రక్షణ బలగాలు (బీఎస్‌ఎఫ్‌) నిర్వహించే రిట్రీట్‌కు శనివారం నుంచి సందర్శకులకు అనుమతి లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సందర్శకులకు అనుమతినివ్వకూడదని బీఎస్‌ఎఫ్‌ నిర్ణయించింది.

► ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో 3,404 మంది మరణించారు. 99,464మందికి వైరస్‌ సోకింది.  

► చైనాలో శుక్రవారం  143 కేసులు నమోదైతే, 30 మంది మరణించారు.  మృతుల సంఖ్య 3,042కి చేరుకుంది.  

► చైనా తర్వాత దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, అమెరికా,  ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో కరోనా ప్రభావం  ఉంది.  

► భూటాన్, సెర్బియా, కామరూన్, వాటికన్‌ సిటీలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూశాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు కేవలం జలుబు మాత్రమే ఉంది. నెదర్లాండ్స్‌లో ఓ వృద్ఢుడు చనిపోయారు.

► భూటాన్‌లో అమెరికా టూరిస్ట్‌కి కరోనా వైరస్‌ ఉన్నట్టు తేలిందని భూటాన్‌ ప్రధాని వెల్లడించారు.  

► అమెరికాలో 14 మంది ఇప్పటివరకు మరణించారు. కేసుల సంఖ్య 230కు పెరిగింది. కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు 8.3 బిలియన్‌ డాలర్లను కేటాయిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం సంతకం చేశారు. ఈ నిధులను వాక్సిన్ల తయారీ, పంపకం, పరీక్షల కోసం వినియోగించనున్నారు.    

► ఇరాన్‌లో 3,500 కేసులు నమోదై, 107 మంది మృతి చెందారు. పేపర్‌ కరెన్సీ వాడొద్దని ప్రజలను కోరింది.

► ఆస్ట్రేలియాలో కరోనా కేసుల సంఖ్య 61కి చేరుకుంది. వ్యాధి నివారణకు 100 కోట్ల డాలర్లు కేటాయించింది.

► చికిత్స సమయంలో     కరోనా రోగుల  హక్కుల్ని కాపాడవలసిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్‌ మిషెల్‌ బాచెలెట్‌ అన్నారు. మనుషుల మర్యాద, వారి హక్కుల్ని అన్ని దేశాలు కాపాడాలన్నారు.  

► ఆస్ట్రేలియాలో కరోనా నేపథ్యంలో టాయిలెట్‌ పేపర్లు ఎక్కడ దొరకవేమోనని భారీగా కొనుగోలు చేసి పెట్టడంతో బహిరంగ మార్కెట్‌లో వీటికి కొరత ఏర్పడింది. దీంతో ఎన్‌టీ న్యూస్‌ గురువారం అదనంగా ఎనిమిది పేజీలతో పేపర్‌ని వాటర్‌ మార్క్‌తో ముద్రించి, దానిని టాయిలెట్‌ పేపర్‌గా వాడుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ పేపర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ పత్రిక ఆలోచన తమకు యమాగా నచ్చేసిందని కామెంట్లు పెడుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top