ఎక్కువమంది మాట్లాడే భాష ఏదో తెలుసా? | which language is spoken most in the world | Sakshi
Sakshi News home page

ఎక్కువమంది మాట్లాడే భాష ఏదో తెలుసా?

Aug 15 2016 2:44 PM | Updated on Aug 13 2018 3:30 PM

ఆర్థిక, సాంస్కృతిక, మత ప్రభావం పెరుగుతున్నకొద్దీ ప్రపంచంలో భాషలు కూడా విస్తరిస్తాయన్న విషయం తెల్సిందే.

ఆర్థిక, సాంస్కృతిక, మత ప్రభావం పెరుగుతున్నకొద్దీ ప్రపంచంలో భాషలు కూడా విస్తరిస్తాయన్న విషయం తెల్సిందే. ప్రపంచంలో ప్రజలు ఎక్కువగా ఏ భాషను తమ మాతృభాషగా మాట్లాడుతున్నారంటే ఎవరైనా తడుముకోకుండా ఠక్కున ఇంగ్లీషు అనేస్తారు. ఇందులో సగం మాత్రమే వాస్తవం. ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ప్రజలు తమ మాతృ భాషగా ఇంగ్లీషు మాట్లాడే అంశం నిజమైనా జనాభా సంఖ్య పరంగా చూస్తే మాత్రం వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇంగ్లీషు భాషను 110 దేశాల ప్రజలు మాట్లాడతారు. బ్రిటిష్ పాలన కారణంగా ఇది ఇన్ని దేశాలకు విస్తరించింది. జనాభాపరంగా లెక్కిస్తే 33.50 కోట్ల మంది ప్రజలు మాత్రమే ఇంగ్లీషు భాషను మాతృ భాషగా మాట్లాడతారని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వెల్లడించింది. వారిలో 22.50 కోట్ల మంది అమెరికన్లే ఉన్నారు. చైనాతోపాటు హాంకాంగ్, తైవాన్, మలేసియా లాంటి అతి తక్కువ దేశాలకు పరిమితమైన చైనా భాషను జనాభాపరంగా చూస్తే మాత్రం ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది మాట్లాడతారట. దాదాపు వంద కోట్ల మంది ప్రజలు చైనా భాషను మాట్లాడుతారు.

ప్రపంచంలో స్పానిష్ మాట్లాడే వారి సంఖ్య రెండో స్థానంలో ఉంది. 35 దేశాల్లో 33.90 కోట్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతారు. ఈ విషయంలో ఇంగ్లీషు భాష మూడో స్థానం ఆక్రమించింది. ఆ తర్వాత స్థానాన్ని అరబిక్ ఆక్రమిస్తోంది. ప్రపంచంలోని 60 దేశాల్లో 24.20 కోట్ల మంది ప్రజలు ఈ భాష మాట్లాడుతారు. ఏడో శతాబ్దంలో ముస్లిం పాలకుల సామ్రాజ్యాల విస్తరణ కారణంగా భాష కూడా విస్తరించింది. అయితే, నేడు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు నేర్చుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. 150 కోట్ల మంది విద్యార్థులు ఇంగ్లీషు భాషను అభ్యసిస్తుండగా, 12.60 కోట్ల మంది విద్యార్థులు ఫ్రెంచ్, చైనా, స్పానిష్ భాషలను అభ్యసిస్తున్నారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement