కొత్త కొత్తగా ఉన్నదీ..!

Traditions of people of different countries on new year - Sakshi

ఎన్నో కలలతో మరెన్నో ఆకాంక్షలతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టబోతున్నాం. గ్రాండ్‌గా న్యూ ఇయర్‌కి వెల్కమ్‌ చెప్పబోతున్నాం. కొత్త ఏడాదంటేనే కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్తేజం. అంత జోష్‌లోనూ కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వివిధ దేశాల ప్రజలు పాటించే ఆ సంప్రదాయాలు ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

స్పెయిన్‌
డిసెంబర్‌ 31 అర్ధరాత్రి వరకు మేల్కొని గడియారం ముల్లు సరిగ్గా 12 మీదకి రాగానే స్పెయిన్‌ దేశస్తులు 12 ద్రాక్షపళ్లు తింటారు. అలా తింటే అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం.  
 

ఈక్వెడార్‌
ఈక్వెడార్‌లో డిసెంబర్‌ 31 రాత్రి ఎవరూ ఇళ్లల్లో ఉండరు. అందరూ రోడ్లపైనే గడుపుతారు. ప్రధాన కూడళ్లలో మంటలు రాజేసి రాజకీయ నాయకుల దిష్టి బొమ్మలను తగుల బెడతారు. ఈ చర్యతో గత ఏడాది కాలంలో జరిగిన చెడు అంతా పోయినట్టుగా భావిస్తారు. ఈ సంప్రదాయం  1895 నుంచి వస్తోంది.  
 
 
గ్రీస్‌

గ్రీస్‌లో జనవరి 1న చర్చికి వెళ్లి వచ్చిన వాళ్లందరికీ అక్కడ ఉల్లిపాయలు పంచుతారు. వాటిని తీసుకువచ్చి దండలా తయారు చేసి ఇంటి గుమ్మానికి వేళ్లాడతీస్తారు. ఉల్లిపాయలు అంటే ఆరోగ్యానికి, సంతానం వృద్ధికి, ఆయుఃప్రమాణాలు పెంచడానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కొత్త సంవత్సరం ఉల్లిపాయల దండ గుమ్మానికి వేళ్లాడదీయడం శుభ పరిణామంగా విశ్వసిస్తారు.  

చెక్‌ రిపబ్లిక్‌
న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా చెక్‌ రిపబ్లిక్‌లో యాపిల్‌ కట్‌ చేస్తారు. అదీ కొత్త ఏడాది తమ అదృష్టం ఎంతో తెలుసుకోవడం కోసం. యాపిల్‌ను మధ్యకి కోస్తారు. యాపిల్‌ మధ్య భాగంలో విత్తనాలు ఉన్న చోట స్టార్‌ వస్తే కొత్త ఏడాదంతా మంచే జరుగుతుందని, అదే క్రాస్‌ వస్తే చెడు జరుగుతుందని వారి నమ్మకం.
 

జపాన్‌
జపాన్‌లో కొత్త సంవత్సరం అంటే అర్ధరాత్రి గంటల్ని గణగణమని మోగిస్తారు. రాత్రి 12 అవగానే 108 సార్లు గంటలు మోగుతాయి. అలా చేస్తేనే తమ జీవితం ఆనందంగా సాగుతుందని అంటారు.  
 

ఇటలీ
ఇటలీలో కొత్త సంవత్సరం కాస్త వినూత్నంగా ఉంటుంది. చెత్త సామాను వదిలించుకోవడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చెత్త సామానంతటినీ బయట పడేస్తారు. అంటే మనసుల్లో ఉన్న చెడు జ్ఞాపకాల్ని వదిలించుకోవడం అన్నమాట. దక్షిణాఫ్రికావంటి దేశాలూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి.  
 
 

చిలీ
కొత్త ఏడాది ఉత్సవాల్ని వివిధ దేశాల ప్రజలు చర్చిల్లో జరుపుకుంటే చిలీ వాసులు తమ రూటే సెపరేటు అంటున్నారు. తమకు అత్యంత ప్రియమైన వారి సమాధుల వద్ద ఈ సంబరాలు నిర్వహిస్తారు. సమాధుల్ని పూల తో అలంకరించి, దీపాలు ఉంచుతారు. ఈ లోకంలో లేకపోయినా సరే కొత్త సంవత్సరం ప్రియమైన వారిని తలచుకోవడం కంటే మించినదేదీ ఉండదని చిలీ వాసులు 1995 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.  
 

డెన్మార్క్‌
డెన్మార్క్‌లో రకరకాల పింగాణి పాత్రలు (క్రాకరీ)ని బద్దలు కొడతారు. ప్లేట్లు, కప్పులు, స్పూన్‌లు లాంటివన్నీ డిసెంబర్‌ 31 అర్ధరాత్రే విరగ్గొట్టేస్తారు. అప్పుడే అదృష్టం తమకి కలిసివస్తుందని వారి నమ్మకం.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top