ఈ కలబంద కడుపు నింపుతుందా?

"Time to Put Cactus on the Menu": FAO's Advice on Food Security - Sakshi

జనాభా పెరిగిపోతోంది.. ఇంకొన్నేళ్లు పోతే తినే తిండికీ పోటీ వచ్చేస్తుందన్న అనుమానాలు బలపడుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఓ వినూత్న ఆలోచనకు తెరతీసింది. ఎడారుల్లో మాత్రమే పండే కలబంద మొక్కలతో భవిష్యత్‌ తరానికి ఆహార భద్రత ఇవ్వవచ్చునని ఈ సంస్థ అంటోంది. ముళ్లతో కూడిన ఓ ప్రత్యేకమైన కలబంద (పియర్స్‌ కాక్టస్‌) మాత్రమే సుమా! మెక్సికోలో పండే ఈ మొక్కలను ఏదో గాలికి పెరిగేవాటిగా కాకుండా ఆహార పంటగా పండించాల్సిన అవసరముందని ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించాలని సూచిస్తోంది.

రెండేళ్ల క్రితం మడగాస్కర్‌లో కరువు వచ్చినప్పుడు కలబంద మొక్కలే ఆదుకున్నాయని, మనుషులకు ఆహారంగా.. దప్పికతీర్చే తీరుగా, పశుదాణాగానూ విస్తృతంగా వాడారని తెలిపింది. మెక్సికన్లు ఈ మొక్కలను ఆహారంగా మాత్రమే కాకుండా షాంపూ మాదిరిగా, రకరకాల వ్యాధులకు మందులుగానూ వాడుతున్నారట. తన ఆకుల్లాంటి నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయగల ఈ మొక్కలు అటు నేల సారాన్ని పెంచేందుకూ పనికొస్తాయి. దాదాపు మూడు ఎకరాల నేలలో పండే కలబంద మొక్కల్లో ఏడాదికి దాదాపు 180 టన్నుల నీరు నిల్వ చేరుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. విపరీతమైన చలి, వేడి పరిస్థితుల్లో ఎదుగుదల మందగించినా ఈ కలబంద మొక్కలతో మేలే ఎక్కువగా జరుగుతుందని ఎఫ్‌ఏవో అంచనా వేస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి మొక్కలను ప్రోత్సహించాలని  సూచిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top