రెండు కుటుంబాలు కాలిపోతుంటే నిస్సహాయులై..
కళ్లముందే తమ కుటుంబాలు కాలిపోతున్నా ఆ ఇంటి యజమానులు నిస్సహాయులుగా మిగిలారు. దహిస్తున్న మంటల్లో భరించలేని వారి కేకలను వింటూ గుండెలు బద్ధలవుతున్నా ఏమీ చేయలేకపోయారు.
కాలిఫోర్నియా: కళ్లముందే తమ కుటుంబాలు కాలిపోతున్నా ఆ ఇంటి యజమానులు నిస్సహాయులుగా మిగిలారు. దహిస్తున్న మంటల్లో భరించలేని వారి కేకలను వింటూ గుండెలు బద్ధలవుతున్నా ఏమీ చేయలేకపోయారు. చివరకు అగ్నికి ఆహుతైన వారి మృతదేహాలను మాత్రమే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ హృదయవిధారక ఘటన ఉత్తర కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఆరాన్ హాన్ వింగ్(34) వెయ్ జియాంగ్ లీ (45) అనే ఇద్దరు స్నేహితులు. వారు తమ రెండు కుటుంబాలతో కలిసి మొత్తం ఎనిమిదిమంది ఓ మినీ వ్యాన్లో ఓ చిన్న విడిదికోసం బయలుదేరారు.
అలా వెళుతూవెళుతూ లాస్ ఎంజెల్స్ కు 65 మైళ్ల దూరంలోని తెహచాపి, శాన్ ఎమిగ్దియో అనే రెండు పర్వతాలు మధ్యలోకి వచ్చిన సమయంలో ఓ బీఎండబ్ల్యూ కారు వారి వ్యాన్ను వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. దాంతో కారు చిమ్మచీకట్లో నడి హైవేపై ఆగిపోయింది. కారుకు ఏమైందో దిగి చూద్దామనుకునేలోగానే అది మెల్లగా రోడ్డుపక్కకు జారిపోవడం ప్రారంభించింది. మొత్తంఎనిమిదిమంది వ్యాన్ లోపలే ఉన్నారు. ఏం జరుగుతుందా అని గట్టిగా కేకలు. ఈలోగా అది కాస్త ఓ దట్టమైన పచ్చికబయళ్లలో ఆగిపోయింది. ముందుడోర్ నుంచి ఆ ఇద్దరు భర్తలు ఏదోలాగా కష్టపడి బయటకు వచ్చారు.
వెనుక డోర్ తీసేందుకు ప్రయత్నించగా అది తెరుచుకోలేదు. అంతలోనే కారులో మంటలు రావడం ప్రారంభించాయి. దాంతో తమ కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఎంతో ప్రయత్నించారు. అదే సమయంలో మంటలు ఎక్కువయ్యాయి. పోలీసులు వచ్చిన అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. చూస్తుండగానే వ్యాన్ మొత్తం మంటలను అలుముకొని వారి రెండు కుటుంబాల సభ్యులను బూడిద చేసింది. అలా ఆ ఇద్దరు స్నేహితులు తమ కుటుంబాలను కోల్పోయారు.


