థాయ్‌ చూపు భారత్‌ వైపు! | Thailand Looking for Indian Tourists | Sakshi
Sakshi News home page

అమెరికా - చైనా ట్రేడ్‌ వార్‌, థాయ్‌ చూపు భారత్‌ వైపు !

Oct 20 2019 6:30 PM | Updated on Oct 20 2019 7:59 PM

Thailand Looking for Indian Tourists - Sakshi

బ్యాంకాక్‌ : అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావం థాయ్‌లాండ్‌ పర్యాటకంపై పడింది. ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకుల్లో ఎక్కువమంది చైనీయులే కావడం ఇందుకు కారణం. ఇప్పటివరకు థాయ్‌కి వచ్చే పర్యాటకుల్లో నాలుగింట ఒకవంతుపైనే చైనీయులు ఉండేవారు. గణాంకాల ప్రకారం 2018లో 22 లక్షలుగా ఉన్న చైనా పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది అందులో ఐదోవంతుకు పడిపోయింది. అయితే గత ఐదారునెలల్లో ఈ సంఖ్య బాగా పడిపోయిందని అక్కడి హోటళ్ల యజమానులు చెబుతున్నారు. పట్టాయా లాంటి ప్రఖ్యాతి గాంచిన ప్రాంతాల్లోనూ పర్యాటకులు లేక హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలను సగానికి తగ్గించామని వారు వెల్లడించారు. దీనికి కారణం చైనా కరెన్సీ యువాన్‌ కంటే థాయ్‌ కరెన్సీ బాట్‌ ఈ ఏడాది దాదాపు 10 శాతం పెరగడమని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది పట్టాయాలో జరిగిన బోటు ప్రమాదంలో 47 మంది చైనీయులు మరణించారు. ఈ ప్రభావం వారిమీద ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

థాయ్‌ జీడీపీలో పర్యాటకం 18 శాతం వాటా కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఉపాధి అవకాశాలపై కూడా ఉంటుందని థాయ్‌ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, థాయ్‌ ప్రభుత్వం మరో మూడు వేల గదులను అందుబాటులోకి తెస్తోంది. దీనిపై పర్యాటక పరిశ్రమ పెదవి విరుస్తోంది. అసలే ఉన్న వాటికి గిరాకీ లేక ఇబ్బంది పడుతుంటే కొత్త నిర్మాణాలెందుకని థాయ్‌ హోటల్స్‌ సంఘం ఉపాధ్యక్షుడు కాంగ్‌సాక్‌ ఖూపోంగ్‌సకోన్‌ ప్రశ్నించారు. దీనికంటే పర్యాటకులను ఆకర్షించే విధానాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో అక్కడి పర్యాటక పరిశ్రమ భారతీయ టూరిస్టులపై ఆశలు పెంచుకుంటోంది. మధ్యతరగతి ఆదాయంలో పెరుగుదల, ప్రత్యక్ష విమానాల రాకపోకలు, వీసా ఆన్‌ అరైవల్‌ వంటి సదుపాయాలు ఇందుకు దోహదపడతాయని వారు ఆశిస్తున్నారు. కాగా, థాయ్‌ కరెన్సీ ఒక బాట్‌ విలువ భారత రూపాయికి రూ. 2.35 పైసలతో సమానం. థాయ్‌ టూరిజం అథారిటీ చైర్మన్‌ యుతసక్‌ సుపసోన్‌ ఈ పరిణామంపై స్పందిస్తూ త్వరలో పరిస్థితిలో మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement