breaking news
Tourism in Thailand
-
థాయ్ చూపు భారత్ వైపు!
బ్యాంకాక్ : అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావం థాయ్‌లాండ్ పర్యాటకంపై పడింది. ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకుల్లో ఎక్కువమంది చైనీయులే కావడం ఇందుకు కారణం. ఇప్పటివరకు థాయ్‌కి వచ్చే పర్యాటకుల్లో నాలుగింట ఒకవంతుపైనే చైనీయులు ఉండేవారు. గణాంకాల ప్రకారం 2018లో 22 లక్షలుగా ఉన్న చైనా పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది అందులో ఐదోవంతుకు పడిపోయింది. అయితే గత ఐదారునెలల్లో ఈ సంఖ్య బాగా పడిపోయిందని అక్కడి హోటళ్ల యజమానులు చెబుతున్నారు. పట్టాయా లాంటి ప్రఖ్యాతి గాంచిన ప్రాంతాల్లోనూ పర్యాటకులు లేక హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలను సగానికి తగ్గించామని వారు వెల్లడించారు. దీనికి కారణం చైనా కరెన్సీ యువాన్ కంటే థాయ్ కరెన్సీ బాట్ ఈ ఏడాది దాదాపు 10 శాతం పెరగడమని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది పట్టాయాలో జరిగిన బోటు ప్రమాదంలో 47 మంది చైనీయులు మరణించారు. ఈ ప్రభావం వారిమీద ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. థాయ్ జీడీపీలో పర్యాటకం 18 శాతం వాటా కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఉపాధి అవకాశాలపై కూడా ఉంటుందని థాయ్ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, థాయ్ ప్రభుత్వం మరో మూడు వేల గదులను అందుబాటులోకి తెస్తోంది. దీనిపై పర్యాటక పరిశ్రమ పెదవి విరుస్తోంది. అసలే ఉన్న వాటికి గిరాకీ లేక ఇబ్బంది పడుతుంటే కొత్త నిర్మాణాలెందుకని థాయ్ హోటల్స్ సంఘం ఉపాధ్యక్షుడు కాంగ్‌సాక్ ఖూపోంగ్‌సకోన్ ప్రశ్నించారు. దీనికంటే పర్యాటకులను ఆకర్షించే విధానాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో అక్కడి పర్యాటక పరిశ్రమ భారతీయ టూరిస్టులపై ఆశలు పెంచుకుంటోంది. మధ్యతరగతి ఆదాయంలో పెరుగుదల, ప్రత్యక్ష విమానాల రాకపోకలు, వీసా ఆన్ అరైవల్ వంటి సదుపాయాలు ఇందుకు దోహదపడతాయని వారు ఆశిస్తున్నారు. కాగా, థాయ్ కరెన్సీ ఒక బాట్ విలువ భారత రూపాయికి రూ. 2.35 పైసలతో సమానం. థాయ్ టూరిజం అథారిటీ చైర్మన్ యుతసక్ సుపసోన్ ఈ పరిణామంపై స్పందిస్తూ త్వరలో పరిస్థితిలో మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
థాయ్లాండ్లోనే ఖర్చు తక్కువ
♦ భారత్‌తో పోలిస్తే 30 శాతం చౌక ♦ ఏటా 2.9 కోట్ల మంది పర్యాటకులు ♦ థాయ్‌లాండ్ టూరిజం డెరైక్టర్ సొరయ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పర్యాటకులకు భారత్‌లో స్థానికంగా పర్యటించే ఖర్చుతో పోల్చినా తమ దేశంలోనే తక్కువని థాయ్‌లాండ్ టూరిజం పేర్కొంది. కాశ్మీర్లో అయ్యే వ్యయంతో పోలిస్తే 30 శాతం ఆదా చేసుకోవచ్చని టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్‌లాండ్ (టీఏటీ) డెరైక్టర్ సొరయ హోమ్‌చెన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘‘నలుగురు సభ్యుల కుటుంబం వారం రోజులు గనక థాయ్‌లాండ్‌లో ఉంటే వసతి, భోజన ఖర్చులకు రూ.2 లక్షలు అవుతుంది. ప్రయాణ చార్జీలు మాత్రం వీటికి అదనం. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్ నగరాలు ఇప్పటికే భారతీయుల దృష్టిలో చాలా పాపులర్’’ అని చెప్పారామె. తేలియాడే హోటళ్లు, వాటర్ ఫాల్స్, రిసార్టులు ఎక్కువగా ఉన్న కాంచనబురి నగరంతోపాటు చియాంగ్మాయ్, చియాంగ్ రాయ్, హువాహిన్, రేయాంగ్, కోహ్ సామెట్, కోహ్ చాంగ్, కోహ్ సమూయ్ వంటి ప్రాంతాలను కొత్తగా తాము ప్రమోట్ చేస్తున్నట్టు తెలియజేశారు. వేడుకలకు వేదిక.. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఏటా 800 సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయని, ఇందులో భారతీయ సినిమాలు 100కుపైగా ఉంటున్నాయని టీఏటీ తెలియజేసింది. మహిళల కోసం, అలాగే బ్యాచిలర్స్ కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను ఈ ఏడాది ఆఫర్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. భవిష్యత్ మార్కెట్.. ఖర్చు చేయగలిగే ఆదాయం పెరగడం, జనాభాలో 50% యువత ఉండడం వంటి కారణాలతో భారతదేశం నుంచి థాయ్‌కి పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు థాయ్ టూరిజం తెలియజేసింది. పర్యాటకుల నుంచి ఆదాయం పరంగా థాయ్‌లాండ్ 7వ స్థానంలో ఉంది. 2015లో 2.9 కోట్ల మంది పర్యాటకులు థాయ్‌లో అడుగుపెట్టారు. భారత్ నుంచి ఈ సంఖ్య 10 లక్షలుంది. చైనా, మలేషియా, జపాన్, కొరియా, లావోస్ తర్వాత భారత్ నుంచి ఎక్కువగా పర్యాటకులు వెళ్తున్నారు. మన దేశం నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య ఏటా 10% వృద్ధి చెందుతోంది. భారత్‌కు రావడం కష్టం.. థాయ్‌లాండ్‌లో అడుగుపెట్టిన పర్యాటకులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. ఈ అంశమే ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకట్టుకోవడానికి దోహదం చేస్తోంది. ప్రపంచ టాప్-20 ఆకట్టుకునే దేశాల్లో థాయ్ స్థానం సంపాదించుకుంది కూడా. వేలాది దర్శనీయ స్థలాలున్నా థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు ఏటా లక్ష మంది మాత్రమే పర్యాటకులు వస్తున్నారు. వీసా ఆన్ అరైవల్ సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణమని, భారత పర్యాటక రంగానికి ఇది పెద్ద అడ్డంకి అని సొరయ తెలిపారు.