టీచర్ వినూత్న ప్రయత్నం.. నెటిజన్లు ఫిదా

Spanish School Teacher Wears Anatomy Bodysuit To Make Learning More Fun - Sakshi

స్పానిష్‌ : బోధన అనేది ఒక గొప్ప కళ. ఒకరికి తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి సులభంగా తెలియజేసే ప్రక్రియనే బోధన. అయితే బోధించడం వేరు.. సులభంగా బోధించడం వేరు. టీచింగ్‌లో ప్రత్యేకత ఉంటేనే విద్యార్థులు ఆసక్తికరంగా పాఠాలు వింటారు.. అర్థం చేసుకుంటారు. అలా కాదని ఓ ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని మొత్తం పిల్లల ముందు ప్రదర్శించినా ఉపయోగం ఉండదు. ఓ ఉపాధ్యాయుడికి ఎంత మేర జ్ఙానం ఉందని ముఖ్యం కాదు.. ఆ జ్ఞానాన్ని ఏ మేరకు విద్యార్థులకు అందిచారనేదే ముఖ్యం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న ఓ ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు వెరైటీగా పాఠాలు చెప్పేందుకు సిద్దపడింది. దాని కోసం ప్రత్యేకమైన డ్రెస్‌ను వేసుకొని తరగతి గదిలోకి వెళ్తోంది. మరి ఆ టీచరమ్మ ఎవరు.. ఆ  డ్రెస్ స్పెషల్ ఏంటీ తెలుసుకుందాం.

స్పానిష్‌కి చెందిన వెరోనికా డ్యూక్(43) 15 ఏళ్ల నుంచి టీచర్‌గా పని చేస్తున్నారు. 3వ తరగతి విద్యార్ధులకు సైన్స్, ఇంగ్లీష్, ఆర్ట్, సోషల్ స్టడీస్, స్పానిష్ సబ్జెక్టులను బోదిస్తారు.ఆ టీచర్ అంటే ఆ విద్యార్ధులకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా వెరోనికా టీచర్ చెప్పే అనాటమీ క్లాస్ (శరీర నిర్మాణ శాస్త్రం) కోసం విద్యార్ధులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆమె చాలా ప్రాక్టికల్. ఆ పాఠం చెప్పేందుకు మానవ అంతర్గత అవయవాలను ప్రింట్ చేసిన సూట్ ధరించి క్లాస్‌కి వెళతారు. ఆమె ఇలా బోధించడం ఫన్నీగా ఉన్నా.. విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సూట్‌ ఐడియా ఎలా వచ్చిందంటే..
ఇంటర్నెట్ని సెర్చ్ చేస్తుండగా చటుక్కున ఓ యాడ్ చూసి.. దాని ప్రభావంతో ఇలా వెరైటీ బోధన చేస్తున్నానని చెబుతోంది వెరోనికా. పిల్లలకు సులభంగా పాఠాలు అర్థం కావాలంటే ఇలా బాడీ సూట్ ధరించడమే మేలని అంటోంది. పైగా వారికి ఇది తమాషాగా, వింతగా కూడా ఉంటుందని తెలిపింది. మానవ అంతర్గత అవయవాలపై చిన్నారులకు తక్కువ అవగాహను ఉంటుందని, ఇలా చేస్తే వారు సులువుగా అర్థం చేసుకుంటారని ఆమె చెబుతోంది.

అనాటమీ సూట్ ధరించి పాఠాలు బోధిస్తున్న వెరోనికా ఫోటోలను ఆమె భర్త మైక్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన భార్యకు ఇలాంటి సరికొత్త ఐడియాకు తానెంతో గర్విస్తున్నాని మైక్‌ అన్నారు. కాగా, వెరోనికా ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఈ పోస్ట్‌కు స్పందన భారీగా వస్తోంది. వేల కొద్దీ రీట్వీట్లు, 67వేల లైక్‌లు వచ్చాయి. వెరోనికా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.. వ్యాకరణ అంశాల్లో నౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్ వంటివి దొర్లినప్పుడు సంబంధిత కార్డ్ బోర్డ్ క్రౌన్లను ధరించి పాఠాలు చెప్పేదట. ఈ సమాజంలో పిల్లలకు బోరింగ్‌గా, లేజీగా పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారనే అపోహలు తప్పని నిరూపించడానికే ఇలా ఫన్నీగా ప్రయోగాలు చేస్తున్నానని వెరోనికా చెబుతోంది. వృత్తి పట్ల వెరోనికాకు ఉన్న నిబద్ధత, విధేయతకు ఈ ప్రయోగమే నిదర్శనం.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top