మంచి అలారం శబ్దం ఏదంటే...

Reasech On Benefits Of Good Alarm Sound - Sakshi

మెల్‌బోర్న్‌ : గణ గణమని గంటకొట్టినట్లు అలారమ్‌ మోగినా, బీప్‌....బీప్‌ మని శబ్దం చేసినా నిద్ర నుంచి మేల్కోవచ్చు. వాటి శబ్దాలకు లేచిన వారు విసుక్కుంటూనో, గొనుక్కుంటూనో అలారమ్‌ ఆపేసి మళ్లీ పడుకుంటారు. లేదా అలారం మూగబోయేదాకా ముసుగు తన్ని పడుకుంటారు. అదే మనకిష్టమైన శ్రావ్యమైన పాటనో, సంగీతాన్నో అలారంగా పెట్టుకుంటే త్వరగా లేచి పోతాం. చురుగ్గా కూడా ఉంటాం. దీనికి కారణాలు కనుగొనేందుకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలోని ‘రాయల్‌ మెల్‌బోర్న్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పరిశోధకులు 50 మంది పై అధ్యయనం చేసి రహస్యాన్ని ఛేదించారు. ఇష్టంలేని అలారమ్‌ శబ్దాన్ని విన్నప్పుడు నిద్రలో ఉన్న మనుషుల మెదడు గందరగోళానికి గురవుతుందట.

అదే శ్రావ్యమైన పాటను విన్నప్పుడు మెదడు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా మెల్లగా ఆ పాటను వినడం కోసం మనల్ని చేతనావస్థలోకి తీసుకొస్తుందని ఆ అధ్యయనంలో పాల్గొన్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆండ్రియాన్‌ డయ్యర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పని ఒత్తిడి కారణంగా ఇష్టంలేని అలారం శబ్దానికి తప్పనిసరై లేచినా ఆ రోజు పని చేస్తున్నంత సేపు చీకాకుగానే ఉంటుందట. అదే ఇష్టమైన శబ్దానికి నిద్ర లేచినట్లయితే పనులను కూడా చురుగ్గా చేసుకుపోతామట. ఇదంతా మెదడు మాయని ఆయన చెప్పారు. ఇష్టమైన పాటలు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకోవడం అందరికి తెలిసిందే. అలాగే మనకిష్టమైన పాటను అలారంగా పెట్టుకుంటే మెల్లగా నిద్రలేస్తాం, చురుగ్గా ఉంటాం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top