ఆమె ఓ ఉత్తుంగ తరంగం | profile of auoung son sukh | Sakshi
Sakshi News home page

ఆమె ఓ ఉత్తుంగ తరంగం

Oct 29 2015 2:56 PM | Updated on Sep 3 2017 11:41 AM

ఆమె ఓ ఉత్తుంగ తరంగం

ఆమె ఓ ఉత్తుంగ తరంగం

నవంబర్‌ 8న మయన్మార్ లో సాధారణ ఎన్నిల జరగనున్న నేపథ్యంలో సూకీ ప్రస్థానం.

ఆమె ఒక ఉత్తుంగ తరంగం.  వజ్రసంకల్పంతో  నిలిచిన ఉక్కు మహిళ.   రెండు దశాబ్దాలపాటు ఓ రాజకీయ  ఖైదీ. అయితేనేం  బాధిత జనాలకు ఆమె  విజయ పతాక.  విశ్వవ్యాప్తంగా ఉన్న స్వేచ్చాకాముకులకు ఆమె ఓ స్ఫూర్తి ప్రదాత.  తన దేశ ప్రజల స్వేచ్చా,  స్వాతంత్ర్యాల కోసం వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి,  సుదీర్ఘ యుద్ధం చేసిన అలుపెరుగని పోరాట యోధురాలు ఆమె. ఆమే మయన్మార్ ప్రతిపక్ష నేత, నోబెల్ అవార్డు గ్రహీత ఆంగ్ సాన్ సూకీ.  మయన్మార్‌ (బర్మా)లో ప్రజాస్వామ్య సాధన కోసం నిత్యం తపిస్తూ, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చిత్తశుద్ధిగా, దృఢ సంకల్పంతో ముందుకు సాగిన జనహృదయనేత ఆంగ్‌ సాన్‌ సూకీ.  నవంబర్‌ 8న మయన్మార్ లో సాధారణ ఎన్నిల జరగనున్న నేపథ్యంలో సూకీ ప్రస్థానాన్ని ఓ సారిచూద్దాం.

జూన్ 19వ తేదీ 1945లో  బర్మా రాజకీయ, సామాజిక హీరో  ఆంగ్ సాన్ - డా ఖిన్ కీ లకు జన్మించింది సూకీ. రెండేళ్ళున్నపుడే ఆమె తండ్రి ఆంగ్ సాన్ హత్యకు గురయ్యాడు . తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ధీశాలి ఆమె. ఢిల్లీ యూనివర్శిటీలో పాలిటిక్స్ , బర్మా, భారత్ , యూకేలో విద్యాభ్యాసం చేసిన సూకీ, ఐక్యరాజ్య సమితిలో కూడా పని చేసింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ లో  పరిచయం అయిన టిబెట్ స్కాలర్ మైఖేల్ ఆరిస్ ను 1972లో వివాహమాడింది. వారికి అలెగ్జాండర్ ,కిమ్ కొడుకులు.

తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తన తల్లికి సేవ చేయడానికి స్వదేశానికి తిరిగి వచ్చిన సూకీ,  సైనిక ప్రభుత్వం వందలాదిమంది విద్యార్థులను  కాల్చి చంపిన ఘటనతో చలించిపోయారు.  అంతే స్వదేశ ప్రజాస్వామ్య పోరాటంలో  మునిగిపోయింది. అప్పటినుంచి  సూకీ  వెన్ను చూపిందిలేదు.  ఎంత అణచివేత ఎదురైనా , సైనిక ప్రభుత్వం  ఎలాంటి క్రూర అకృత్యాలకు పాల్పడినా లక్ష్యాన్ని వీడలేదు.

ఈ పట్టుదలే 1988 లో సెప్టెంబరు 24న ప్రో డెమాక్రెటిక్ పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ ఆవిర్భావానికి నాంది పలికింది.  పార్టీకి జనరల్ సెక్రటరీగా ఆంగ్ సాన్ సూకీ ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్వేచ్చ, ప్రజాస్వామ్యాల కోసం రాజకీయ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఎంత  హింస  చెలరేగినా, ఎన్ని వేలమందిని మిలటరీ ప్రభుత్వం పొట్టనపెట్టుకున్నా  ప్రజలు ఆమెకు  వెన్నుదన్నుగా నిలిచారు.  1990 ఎన్నికల్లో  సూకీకి ఘన విజయాన్నందించారు. ప్రజల్లో ఆమెకున్న అపూర్వ  ఆదరణకు ఇదే నిదర్శనం.

దీన్ని జీర్ణించుకోలేని మిలిటరీ ప్రభుత్వం సూకీని గృహనిర్బంధంలో ఉంచింది.   1995లో గృహనిర్బంధం నుండి విడుదల చేయబడినా, ఆమె ప్రయాణం చేయడాన్ని నిషేధించింది ప్రభుత్వం. ఆమె సంపూర్ణంగా, బర్మాను విడిచిపెట్టి వెళ్ళిపోతే స్వేచ్చగా వెళ్ళనిస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనను సూకీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఫలితం మళ్లీ  గృహనిర్బంధం. ఇంతలో ఆమె భర్త మైఖేల్ ఏరిస్ మార్చి 27, 1999న కేన్సర్ తో మరణించాడు. మరణించే ముందు భార్యను ఒకసారి కలవనివ్వమని ఎంతగా ప్రాధేయపడినా, బర్మా ప్రభుత్వం  కర్కశంగా వ్యవహరించి అనుమతిని నిరాకరించింది.
     
 ఐక్యరాజ్యసమితి జోక్యంతో 2002 మే 6 న  దేశ పర్యటన చేయడానికి అనుమతితో విడుదలైన సంవత్సరానికే  2003లో మళ్లీ దాడిచేసి ఆమెను బందీని చేసింది బర్మా ప్రభుత్వం. తిరిగి రంగూన్ ఇంసేయిన్ జైలులో  బంధించబడింది.  2010లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని సైతం నిషేధించారు. చివరికి వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాల  ఒత్తిళ్లు, నిరసనల నేపథ్యంలో 2010 నవంబరు 13 ఆమె నిర్బంధం నుంచి బయటకు వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణలో వివిధ దేశాల మద్దుత కోసం నిర్విరామంగా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది.  మయన్మార్‌లో బలమైన ప్రజాస్వామ్యం కోసం  వివిధ దేశాల మద్దుతను కూడగట్టే పనిలో భాగంగా భారత్ లాంటి దేశాల్లో పర్యటించారు.

 దాదాపు 50 ఏళ్లపాటు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో  అనేక సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య సూకీ బృందం  ఎన్నికల బరిలోకి దిగుతోంది.  వారి ముందున్న సవాళ్ళు అనేకం.  ప్రజాప్రయోజనాలకు అనుకూలంగా కార్యాచరణ  రూపొందించుకోవాలి.  సంస్కరణల దిశగా అడుగులు వేయాలి.  అంతర్జాతీయ మీడియా, దేశాలు ఆమె కార్యాచరణపై కచ్చితంగా  దృష్టి సారిస్తాయి. ఈ  క్రమంలో 'నేనెపుడూ ఆశావాదినే ...  కాలమే చెప్తుంది' అన్న  ఆమె మాటల ప్రకారం మయన్మార్  ప్రజలకు మంచి రోజులు వస్తాయని... రావాలని ఆశిద్దాం.

అటు  పొరుగు దేశం నేపాల్ లో  మహిళ దేశాధినేతగా అధికార పగ్గాల చేపట్టిన తరుణంలో  మయన్మార్ ఎన్నికలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నోబెల్ పీస్ ప్రైజ్, యూరోపియన్ పార్లమెంటు నుండి సఖరోవ్ ప్రైజ్, యునైటెడ్ స్టేట్స్ నుంచి  ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ మొదలైన అంతర్జాతీయ అవార్డులెన్నో ఆమెను వరించాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement