'ఉగ్ర' పుట్టిల్లు పాక్ | Sakshi
Sakshi News home page

'ఉగ్ర' పుట్టిల్లు పాక్

Published Mon, Oct 17 2016 2:28 AM

'ఉగ్ర' పుట్టిల్లు పాక్ - Sakshi

బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ధ్వజం
పాక్‌కు రాజకీయ, ఆయుధసాయాన్ని తగ్గించుకోవాలి.. చైనాకు సూచన
► ఉగ్రవాదంపై పోరాటానికి  సభ్యుల ఏకాభిప్రాయంపై హర్షం
► వివిధ రంగాల్లో సాయానికి   బ్రిక్స్ దేశాల ఆమోదం
► 2020 కల్లా వాణిజ్యాన్ని రెట్టింపుచేయాలన్న మోదీ నిర్ణయానికి ఓకే

 
 బెనౌలిమ్ (గోవా): అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టినిల్లని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని, దీనికి పూర్తి మద్దతిస్తున్న వారిని ఎదుర్కొనేందుకు అన్నిదేశాలు సమగ్ర, సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్లాలని బ్రిక్స్ సదస్సులో కోరారు. రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్‌పింగ్‌తోపాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికాల దేశాధినేతలతో ఆదివారమిక్కడ జరిగిన బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్ పేరును ఉచ్ఛరించకుండానే.. తీవ్రవిమర్శలు చేశారు. ‘ఉగ్రవాదానికి రక్షణ కల్పిస్తూనే.. రాజకీయ అవసరాలకోసం ఉగ్రవాదానికి మద్దతివ్వటాన్ని సమర్థించుకుంటున్నారు.

అందుకే ఉగ్రవాదానికి ఏ రూపంలో సాయం చేస్తున్నా వారు శిక్షార్హులే’ అని అన్నారు. ఈ ఉగ్రవాదం చేస్తున్న హెచ్చరికలను ఎదుర్కొని సరైన సమాధానం చెప్పేందుకు బ్రిక్స్ దేశాలు ముందుకురావాలన్నారు. ఉగ్రవాదంపై సభ్యదేశాలు వ్యక్తిగతంగా, సంయుక్తంగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. ‘మా ప్రాంతంలో ఉగ్రవాదం.. శాంతికి, భద్రత, అభివృద్ధికి పెనుసవాల్‌గా మారింది. దురదృష్టవశాత్తూ.. అది మా పొరుగు దేశమే. వారు ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా వ్యవహరిస్తున్నారు. వారు ఉగ్రవాదానికి రక్షణ కల్పించటమే కాదు.. ఉగ్రవాద శిక్షణనిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి ఆ దేశంలోనే లింకులు దొరుకుతున్నాయి’ అని మోదీ మండిపడ్డారు.

ఇలాంటి మైండ్‌సెట్‌ను బ్రిక్స్ ముక్తకంఠంతో ఖండించాలని.. ఒకేతాటిపై నిలిచి దీన్ని ఎదుర్కోవాలన్నారు. ఈ దేశానికి ఆయుధ సరఫరా, రాజకీయ మద్దతు వంటివి.. క్రమంగా తగ్గించుకోవాలని చైనాకు చెప్పకనే చెప్పారు. ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం’ ముసాయిదాను వీలైనంత త్వరగా ఆమోదం తెలపటం ద్వారా ఉగ్రవాదంపై పోరును ముందుగానే మొదలుపెట్టొచ్చన్నారు. వ్యక్తిగత, కృత్రిమ కారణాలతో ఉగ్రవాదంపై విభేదాలు చూపొద్దని పరోక్షంగా చైనాకు (పఠాన్‌కోట్ ఘటన సూత్రధారి మసూద్ అజర్‌కు ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడటానని చైనా అడ్డుకోవటాన్ని దృష్టిలో ఉంచుకుని) సూచించారు. జాతీయ భద్రతా సలహాదారుల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ మానవాళికి, అభివృద్ధికి, శాంతి, భద్రతలకు ముప్పుగా మారిన ఉగ్రవాదంపై పోరుకు బ్రిక్స్ దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని ప్రధాని వెల్లడించారు.

ఈ దిశగా ఈ ఐదు దేశాలు ఒకరికొకరు సహకారం అందించుకోవాలని అంగీకరించాయని.. ఇది చాలా సంతోషకరమని మోదీ తెలిపారు. పుతిన్, జిన్‌పింగ్‌తో జరిగిన ద్వైపాక్షిక భేటీలోనూ మోదీ ఉగ్రవాదం అంశాన్ని ప్రధానంగా చర్చించారు. పాక్ ప్రోత్సహిస్తున్న ఉన్మాదం వల్ల భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారంతో.. ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సృజనాత్మక, వాణిజ్య, పర్యాటక, పర్యావరణ, శక్తి, సినిమాలు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీల రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు దోహదపడుతుందని మోదీ తెలిపారు.

‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు’, ‘కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్‌మెంట్’ ఏర్పాటు చాలా గొప్ప పరిణామమన్న ప్రధాని.. ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరమైన సమస్యలు, ఆర్థిక అస్థిరత నెలకొంటున్న పరిస్థితుల్లో.. బ్రిక్స్ పాత్రను మరింత సమర్థవంతంగా నడపాలన్నారు. బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పన్ను ఎగవేత, నల్లధనంపై పోరాటం, అవినీతిపై పోరాటానికి మరింత కఠినమైన నిబంధనలను రూపొందించుకోవాలన్నారు. 2015లో బ్రిక్స్ దేశాల మధ్య 250 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని.. 2020 కల్లా దీన్ని రెట్టింపు (500 బిలియన్ డాలర్లు) చేయాలని మోదీ సూచించారు.
 
భారత్ సరళీకృత ఆర్థిక వ్యవస్థ
రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావం స్పష్టంగా కనబడుతోందని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బలమైన వృద్ధిరేటుతో ప్రపంచంలోనే అత్యంత సరళీకృత ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉద్భవించిందన్నారు. పాలన, వ్యాపారాన్ని సులభతరం చేస్తూ రెండేళ్లుగా తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఈ మార్పు సాధ్యమైందని బ్రిక్స్ సదస్సులో మోదీ తెలిపారు. పరోక్ష పన్నుల విధానం, జీఎస్టీ, దివాళా కోడ్ ప్రవేశపెట్టడం, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాల కారణంగా బలమైన అభివృద్ధి కనబడుతోందని.. దీన్ని కొనసాగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. దేశీయ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతూ పోతోందని.. రక్షణ, ఇన్సూరెన్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. మౌలిక వసతులను పెంచేందుకు ట్రిలియన్ డాలర్ల అంచనాతో వచ్చే పదేళ్లలో రోడ్లు, హైవేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టామన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement