అభినందన్‌ విడుదల; పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Pakistan Minister Controversial Comments On IAF Pilot Abhinandan Release - Sakshi

ఇస్లామాబాద్‌ : శాంతి చర్చలకు సిద్ధపడే భారత పైలట్‌ అభినందన్‌ను విడుదల చేస్తున్నామంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభినందన్‌ వాఘా సరిహద్దు గుండా భారత్‌లో అడుగుపెట్టనున్నారు. దీంతో దేశ ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభినందన్‌ విడుదలపై పాకిస్తాన్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం భారత పైలట్‌ను విడుదల చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోదీ ఆలోచనలు వేరుగా ఉంటాయి..
‘భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి పాలనలో ఉన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు లేవు. నరేంద్ర మోదీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. యుద్ధ సమయంలో ఒక్క భారత జెట్‌ ఫైటర్‌ కూడా కార్గిల్‌ దాటలేదు. కానీ ఇప్పుడు ఏకంగా 14 జెట్లు వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో మోదీ మనపై కావాలనే దాడులు చేయించారని వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే భారత పైలట్‌ను విడుదల చేసిన తర్వాత మోదీ మరోసారి దాడి చేయరని నమ్మకం ఏముంది. ఒకవేళ రేపటి రోజున మోదీ దాడులు చేయిస్తే మన పరిస్థితి ఏంటి. భారత్‌లోని ప్రతీ ముస్లిం పాకిస్తాన్‌ గురించి ఆలోచిస్తున్నారు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాగా పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి దాడికి ప్రయత్నించిన పాక్‌ విమానాలను తిప్పి కొట్టే క్రమంలో భారత పైలట్‌ అభినందన్‌ ఆ దేశ ఆర్మీకి చిక్కారు. అయితే అనేక పరిణామాల అనంతరం ఆయన శుక్రవారం భారత్‌లో అడుగుపెట్టనున్నారు. ఇక అభినందన్‌ను విడుదల చేయాలంటూ తమ దేశమంతా కోరుకుంటోందని చెబుతూనే.. మరోవైపు అతడి విడుదలను సవాలు చేస్తూ పలువురు కార్యకర్తలు పాక్‌ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top