పాక్‌కు చివరి హెచ్చరిక

Pakistan may avoid being blacklisted by terror financing - Sakshi

ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటుపై ఎఫ్‌ఏటీఎఫ్‌ అసంతృప్తి

బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని వార్నింగ్‌

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు, ద్రవ్య అక్రమ రవాణా అరికట్టే విషయంలో ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడం ఖాయమని ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్తాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భాగంగా ఉగ్రమూకలకు ఆర్థిక తోడ్పాటుకు ముగింపు పలికేందుకు పాకిస్తాన్‌కు మరో నాలుగునెలల సమయాన్నిచ్చింది. 2020 ఫిబ్రవరి నాటికి 27 అంశాలతో కూడిన ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ఆర్థిక ఆంక్షలు తప్పవని ఎఫ్‌ఏటీఎఫ్‌ అధ్యక్షుడు జియాంగ్మిన్‌ లియూ హెచ్చరించారు. పారిస్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలు జరుగుతున్నాయి.

పూర్తిగా విఫలమైంది...
పాక్‌ని ప్రస్తుతం ‘గ్రే లిస్ట్‌’లో కొనసాగించినా, లేక ‘డార్క్‌ గ్రే లిస్ట్‌’లో ఉంచినా ఆర్థిక ఆంక్షల చట్రం బిగుసుకుంటుంది. ఐఎంఎఫ్‌ నుంచి గానీ, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి గానీ పాక్‌కు ఏవిధమైన ఆర్థిక సాయం ఉండదు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్‌ తీవ్రంగా విఫలమైందని ఎఫ్‌ఏటీఎఫ్‌ సభ్యులంతా ముక్తకంఠంతో విమర్శించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అదుపుచేయడం, డబ్బు అక్రమరవాణాకి స్వస్తిపలికేందుకు అదనపు చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆదేశించింది. యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ నిర్దేశించిన  27 అంశాల్లో కేవలం ఐదంశాలను మాత్రమే పాక్‌ సరిగ్గా అమలు చేయగలిగిందని తెలిపింది. ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు నిలిపివేయాలంటూ 2018లో పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ ‘గ్రే లిస్ట్‌’ లో పెట్టింది.

లక్ష్యాలను చేరుకోవాలి..                                                                                                                                                                                                    
అంతర్జాతీయ ఆర్థిక సమర్థత కోసం ఏర్పాటు చేసిన ఎఫ్‌ఏటీఎఫ్‌ 1989 నుంచి ప్రభుత్వ అంతర్‌ సంస్థగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి  205 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ ప్లీనరీ సమావేశాల్లో ఐఎంఎఫ్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థలు పాల్గొన్నాయి. లష్కరే తోయిబా వ్యవ స్థాపకుడు హఫీజ్‌ సయీద్, జైషే మొహమ్మద్‌ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజర్‌ లాంటి ఉగ్రనేతలను కట్టడి చేయాలని పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top