పాక్‌ మ్యూజియంలో అభినందన్‌ బొమ్మ

Pakistan Air Force puts Wing Commander Abhinandan is mannequin in museum - Sakshi

కరాచీ: భారత్‌పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని పాకిస్తాన్‌ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్తాన్‌ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో భారత వైమానికదళ వింగ్‌కమాండర్‌ వర్ధమాన్‌ బొమ్మను ప్రదర్శించింది. వర్ధమాన్‌ చుట్టూ పాక్‌సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్‌ వైమానిక దాడుల సమయంలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్తాన్‌ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో అతను నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్‌ భూభాగంలో కూలిపోయింది.

అతను సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్‌ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. ఈ ఘటనపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లోనూ పాకిస్తాన్‌ వ్యంగ్య ప్రచారాన్ని చేసింది. తాజాగా అభినందన్‌ బొమ్మను మ్యూజియంలో ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్‌ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అన్వర్‌లోధీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘అభినందన్‌ బొమ్మ చేతిలో ఒక టీ కప్పు ఉంచితే బొమ్మకు మరింత పరిపూర్ణత వచ్చేది’అని లోధీ వ్యాఖ్యానించాడు. అభినందన్‌ పాకిస్తాన్‌ అదుపులో ఉన్నప్పుడు పాక్‌ సైన్యం విడుదల చేసిన ఒక వీడియోలో అభినందన్‌ టీ తాగుతున్నట్టుగా చూపించడంతో లోధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top