సరిహద్దుకు అటూ.. ఇటూ..

Pak F-16 pilot was lynched by his own people - Sakshi

ప్రాణాలతో బయటపడ్డ వర్ధమాన్‌

సొంత పైలట్‌నే కొట్టిచంపిన పాక్‌ అల్లరిమూకలు

శత్రు దేశానికి చిక్కినా ప్రాణాలతో తిరిగొచ్చిన ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు యావత్‌ జాతి జేజేలు పలుకుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్‌లో ఒక పైలట్‌ కుటుంబం తమ కొడుకు చేసిన త్యాగాన్ని బయటకు చెప్పుకోలేక, బడబాగ్నిలాంటి నిజాన్ని మనసులో దాచుకోనూలేక మౌనంగా రోదిస్తోంది. ఇద్దరూ పైలెట్లే. ఇద్దరి కుటుంబ నేపథ్యం ఒక్కటే. ఇద్దరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయే అల్లరిమూక చేతికి చిక్కారు. కానీ ఒకరి కథ సుఖాంతం. మరొకరిది అంతులేని విషాదం.

పాకిస్తాన్‌ వాయుసేన భారత సైనిక స్థావరాలపై దాడికి దిగినప్పుడు ఒక ఎఫ్‌16 యుద్ధ విమానాన్ని షాహాజుద్దీన్‌ అనే పైలట్‌ నడుపుతున్నారు. ఆ విమానాన్ని మన సైనికులు కూల్చేశారు. ఆఖరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన పారాచూట్‌ సాయంతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లోని నౌషెరా సెక్టార్‌లో దిగారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో పీవోకే యువతలో భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పారాచూట్‌ నుంచి కిందకి దిగుతున్న షాహాజుద్దీన్‌ను చూసి లామ్‌వ్యాలీ గ్రామంలో అల్లరిమూక భారత పైలట్‌ అని పొరపడింది. చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడిచేయడంతో తీవ్రంగా  గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అభినందన్‌ వర్ధమాన్‌ కూడా అల్లరిమూకకు చిక్కినప్పటికీ పాక్‌ ఆర్మీ ఆయన్ను కాపాడగలిగింది.

ఇద్దరిదీ ఒకటే కథ
అభినందన్‌ వర్థమాన్, షాహాజుద్దీన్‌ది ఇంచుమించుగా ఒక్కటే కథ. అభినందన్‌ తండ్రి సింహకుట్టి వర్ధమాన్‌ మాజీ ఎయిర్‌మార్షల్‌ కాగా, షాహాజుద్దీన్‌ తండ్రి వసీముద్దీన్‌ కూడా పాకిస్తాన్‌ వైమానిక దళంలో ఎయిర్‌మార్షలే. ఎఫ్‌–16, మిరాజ్‌ విమానాలను నడపడంలో ఆయన దిట్ట. ఆ ఇద్దరి పైలెట్ల కుమారులు తమ కర్తవ్యాన్ని నిర్వహించడానికి, తమ దేశాల రక్షణ కోసం యుద్ధవిమానాల్లో గగనతలంలో ఒకరితో మరొకరు తలపడ్డారు. కానీ ఆ యుద్ధంలో ఒకరు వీరుడై తిరిగొచ్చి కోట్లాది గుండెల్లో విజేతగా నిలిస్తే, మరొకరు తోటి పాకిస్తానీల చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకుని కోట్లాది గుండెల్లో విషాదాన్ని నింపేశారు.   

పాక్‌వి ఎప్పుడూ కట్టుకథలే
యుద్ధ సమయాల్లో నిజాలు చెప్పే చరిత్ర పాక్‌కి లేనేలేదు. 1965 యుద్ధం, 1971 యుద్ధం, కార్గిల్‌ ఇలా అన్ని సమయల్లో కట్టు కథలే చెప్పింది. ఈసారి కూడా తమ సొంత పైలట్‌ విషయంలోనూ సరైన సమాచారం లేక మొదట నోరుజారింది. పాక్‌ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ గఫూర్‌ ఫిబ్రవరి 28న ఇద్దరు భారతీయ పైలెట్లను పట్టుకున్నామన్నారు. ఒకరు ఆర్మీ కస్టడీలో ఉన్నారని, మరొకరు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి ఒక్కరే తమ చేతికి చిక్కారని వెల్లడించారు. ఆ రెండో పైలట్‌ ఎక్కడున్నారన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ విషయం లండన్‌కి చెందిన లాయర్‌ ఖలిద్‌ ఉమర్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. అల్లరి మూక చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పాక్‌ పైలట్‌ షాహజుద్దీన్‌ ఉమర్‌కు బంధువు కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top