‘వారి’ స్ఫూర్తితోనే ఉన్మాది కాల్పులు

New Zealand Shooting Attacker Inspiration From Historical Figures - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌లోని రెండు మసీదుల్లోకి శుక్రవారం ఓ సాయుధ దుండగుడు జొరబడి ప్రార్థన చేస్తున్న ముస్లింలు లక్ష్యంగా దాడులు జరపడంతో దాదాపు 49 మంది మత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి ముందే దుండగుడు తనను తాను బ్రెంటన్‌ టారెంట్‌ అనే 28 ఏళ్ల యువకుడిగా ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్నారు. జన్మతా ఆస్ట్రేలియాకు చెందిన టారెంట్‌ శ్వేత జాత్యాహంకారిగా ఆయన తన ఆయుధాలపై, సైనిక దుస్తులపై, చేతి గ్లౌజులపై రాసుకున్న పేర్లను బట్టి తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సామ్రాజ్యాలపై దండయాత్రలు జరిపి విజయం సాధించిన చారిత్రక పురుషుల పేర్లను, అలాంటి యుద్ధాల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన వారి పేర్లను తనకు స్ఫూర్తిదాయకంగా రాసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసుకున్న దాదాపు 50 పేర్లలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం.

1. డేవిడ్‌ సోస్లాన్‌ :12,13వ శతాబ్దానికి చెందిన జార్జియా కింగ్‌ పేరు. ఆయన ఇరుగు, పొరుగు ముస్లిం దేశాలపై తరచుగా యుద్ధాలు చేశారు.

2. జార్జియా నాలుగవ డేవిడ్‌: ఈయన ‘డేవిడ్‌ ది బిల్డర్‌’గా సుపరిచితులు. జార్జియా చరిత్రలోనే ఆయన తనకు తాను గొప్ప చక్రవర్తిగా చెప్పుకునే వారు. 1121లో జరిగిన డిడ్గోరి యుద్ధంలో టర్కీష్‌ దళాలను దేశం నుంచి తరమికొట్టారు. దేశంలోని పలు ప్రాంతాలను తన స్వాధీనంలోకి తీసుకున్నారు.

3. దిమిట్రి సెన్యామిన్‌: 1787-92, 1806-12 రెండు రష్యా, టర్కీష్‌ యుద్ధాల్లో వీరోచిత పాత్ర వహించిన రష్యన్‌ అడ్మిరల్‌.

4. సెర్బాన్‌ కాంటాకుజ్నో: రొమానియన్‌ మాజీ యువరాజు. యూరప్‌ నుంచి టర్కీలను తరిమికొట్టారు.

5. మార్కో మిల్జానొవ్‌: మాంటెనెగ్రిన్‌ జనరల్‌. ఆయన కూడా టర్కీలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. తనకు తాను సమర్థుడైన నాయకుడిగా చెప్పుకున్న వ్యక్తి.

6. స్టెఫన్‌ లజారెవిక్‌ : సెర్బియా రాజు. టర్కీష్‌లకు వ్యతిరేకంగా పోరాడి స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించుకున్న వ్యక్తి.

7. ఎడ్వర్డ్‌ కాండ్రింఘ్టన్‌ : తొలుత బ్రిటీష్‌ అడ్మిరల్‌గా, ఆ తర్వాత కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేశారు. గ్రీక్‌ స్వాతంత్య్ర ఉద్యమం సందర్భంగా టర్కీలకు, ఈజిప్టులకు వ్యతిరేకంగా పోరాడారు.

8. మార్కో అంటోనియో బ్రగాడిన్‌ : వేనిస్‌ రిపబ్లిక్‌ ఆఫీసర్‌. సైప్రస్‌పై టర్కీల దాడిని తీవ్రంగా ప్రతిఘటించి ఆ తర్వాత టర్కీష్‌ జనరల్‌ చేతుల్లో మరణించారు.

9. ఎర్నెస్ట్‌ రూడిగర్‌ స్టార్‌ఎంబెర్గ్‌ : ఆస్ట్రేలియా జాతీయవాద రాజకీయ వేత్త. ఆస్ట్రేలియా క్యాథిలిక్‌ క్రిస్టియానిటి రక్షణ కోసం ‘ఫాదర్‌లాండ్‌ ఫ్రంట్‌’ అనే ఫాసిస్టు సంస్థను స్థాపించిన నాయకుడు. యువకుడిగా ఉండగానే ఆయన జర్మనీకి వెళ్లి అక్కడ హిట్లర్‌ను, నాజీలతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారు. మసీదులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టారెంట్‌పై ఈయన ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో టారెంట్‌ తన ఒక్కరి గురించె చెప్పుకున్నాడు. తనకు అనుచరులు ఉన్నట్లు కూడా ఎక్కడా చెప్పలేదు. అయితే దాడిలో ఆయన అనుచరులు కూడా పాల్గొన్నట్లు న్యూజిలాండ్‌ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.

న్యూజిలాండ్‌ కాల్పుల కలకలం.. 49 మంది మృతి

ఫేస్‌బుక్‌ లైవ్‌తో రాక్షసానందం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top