జైల్లో షరీఫ్‌కు బీ–క్లాస్‌ వసతి | Sakshi
Sakshi News home page

జైల్లో షరీఫ్‌కు బీ–క్లాస్‌ వసతి

Published Sun, Jul 15 2018 2:52 AM

Nawaz Sharif, Maryam provided 'B' class facilities in Adiala jail - Sakshi

ఇస్లామాబాద్‌: అవెన్‌ఫీల్డ్‌ కేసులో శుక్రవారం అరెస్టయిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్‌లకు రావల్పిండిలోని అదియాలా జైలులో బీ–క్లాస్‌ వసతులు కల్పించినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. లాహోర్‌ విమానాశ్రయంలో దిగగానే వీరిద్దరిని అరెస్ట్‌ చేసిన అధికారులు విమానంలో రావల్పిండికి తరలించారు. తర్వాత షరీఫ్, మరియమ్‌లను అదియాలా జైలుకు తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న వైద్యులు షరీఫ్, మరియమ్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించి వీరు ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చారు.

శనివారం ఉదయం అల్పాహారంలో భాగంగా వీరిద్దరికి ఎగ్‌ఫ్రై, పరోటా, టీని జైలు అధికారులు ఇచ్చారు. ఉన్నతస్థాయి విద్యావంతులు, ధనికులు తదితరులకు జైలులో బీ– క్లాస్‌ వసతిని కల్పిస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం బీ–క్లాస్‌ ఖైదీల గదిలో ఓ మంచం, కుర్చీ, లాంతరు, ఓ అల్మారా తదితర సౌకర్యాలుంటాయి. ఖైదీల ఆర్థిక స్థోమతను బట్టి జైలు గదిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, వార్తాపత్రికలు సమకూర్చేందుకు జైళ్ల శాఖకు అధికారాలున్నాయి. ప్రస్తుతం బీ–క్లాస్‌ వసతులు అనుభవిస్తున్న షరీఫ్, మరియమ్‌లకు సీ–క్లాస్‌లోని నిరక్షరాస్యులైన ఖైదీలకు చదువు చెప్పే బాధ్యతను అప్పగించే అవకాశముంది.  

పంజాబ్‌ ప్రావిన్సులో ఘర్షణలు..
షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్‌ అరెస్టులను నిరసిస్తూ వారి స్వస్థలమైన పంజాబ్‌ ప్రావిన్సులో పలుచోట్ల మద్దతుదారులు పోలీసులతో గొడవకు దిగారు. ఈ ఘర్షణల్లో దాదాపు 50 మంది షరీఫ్‌ మద్దతుదారులు, 20 మంది పోలీసులు గాయపడ్డారు.  కాగా, శుక్రవారం షరీఫ్‌ రాక నేపథ్యంలో అరెస్ట్‌చేసిన 370 పీఎంఎల్‌–ఎన్‌ నేతల్ని, కార్యకర్తల్ని విడుదల చేయాలని లాహోర్‌ హైకోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement