దాడి వెనుక ఐఎస్‌ఐ కుట్ర | ISI conspiracy on the attack | Sakshi
Sakshi News home page

దాడి వెనుక ఐఎస్‌ఐ కుట్ర

Jul 4 2016 2:17 AM | Updated on Apr 7 2019 3:35 PM

దాడి వెనుక ఐఎస్‌ఐ కుట్ర - Sakshi

దాడి వెనుక ఐఎస్‌ఐ కుట్ర

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విదేశీయులను బందీలుగా చేసుకొని దారుణంగా హతమార్చింది తమ దేశ ఉగ్రవాదులేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టంచేసింది.

బంగ్లా సర్కారు ప్రకటన
- వారంతా దేశీయ ఉగ్రవాదులే
- ఉన్నత చదువులు చదివినవారే
 
 ఢాకా : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విదేశీయులను బందీలుగా చేసుకొని దారుణంగా హతమార్చింది తమ దేశ ఉగ్రవాదులేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనివెనుక పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ కుట్ర ఉందని తేల్చి చెప్పింది. 20 మందిని పొట్టనపెట్టుకున్న ఈ మారణకాండలో ఐసిస్, అల్‌కాయిదాల ప్రమేయం లేదని తెలిపింది. ‘ఆ ఉగ్రవాదులంతా బంగ్లా వారే. దేశీయ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) లాంటి ఉగ్రసంస్థల వారు. వారంతా ఇక్కడే పుట్టి పెరిగారు. వారి గురించి మాకు తెలుసు. వారి పూర్వీకులు కూడా మాకు తెలుసు’ అని హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ చెప్పారు. 

అయితే ఈ దాడి ఘటనకు తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించింది. దాడిలో పాల్గొన్న వారంతా పెద్ద కత్తిలాంటి ఆయుధంతో బందీలను చంపారని, దీన్నిబట్టి చూస్తే స్థానిక నిషేధిత ఉగ్రసంస్థ జేఎంబీకి చెందిన వారిగా స్పష్టమవుతోందని ప్రధాని రాజకీయ సలహాదారు హుసేన్ తౌఫిక్ ఇమామ్ చెప్పారు. జేఎంబీకి ఐఎస్‌ఐతో ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలుసని, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఇలా కుట్రపన్నారన్నారు. ఈ ఉగ్రవాదులు సంపన్న కుటుంబాలకు చెందిన ఉన్నత విద్య అభ్యసించిన వారేనని,  మదర్సాల్లో చదువుకోలేదని పోలీసులు చెప్పారు. దాడిలో ఆర్మీ కమాండోలు చంపిన ఆరుగురి ఉగ్రవాదుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వారిని ఆకాశ్, బికాస్, డాన్ బంధోన్, రిపోన్‌గా గుర్తించారు. ప్రాణాలతో పట్టుబడిన ఏకైక ఉగ్రవాదిని ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఈ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన తారుషి జైన్‌తోపాటు మరో ఇద్దరు (బంగ్లా జాతీయులు) అమెరికా వర్సీటీల విద్యార్థులు. తారుషి మృతదేహాన్ని సోమవారం భారత్‌కు తీసుకువస్తామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు.

 ఉగ్రవాదుల్లో రాజకీయ నేత కొడుకు?
 దాడిలో పాలుపంచుకున్న ఏడుగురు ఉగ్రవాదుల్లో బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ నాయకుడి కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఢాకా శాఖకు చెందిన ఎస్‌ఎం ఇంతియాజ్ ఖాన్ బాబుల్ కొడుకు రోహన్ ఇబ్నే ఇంతియాజ్ రెస్టారెంట్ దాడిలో పాల్గొన్నట్లు  ఆ పార్టీ  మరో నేత గుర్తించారని ‘బీడీ న్యూస్’ పేర్కొంది. రోహన్ కుటుంబ సభ్యులతో కలసి ఉన్న ఫొటోను అతడి మాజీ క్లాస్‌మేట్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. తన కొడుకు కనిపించడంలేదని బాబుల్ గత జనవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement