భద్రతపైనే భయం

భద్రతపైనే భయం - Sakshi


► అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో ఆందోళన

► ఐఐఈ తాజా సర్వేలో వెల్లడి
అమెరికాలో చదువుకునేందుకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో భద్రతకు సంబంధించిన భయాందోళనలు ఎక్కువయ్యాయి. అక్కడ చదువుకునేందుకు వెళ్లిన ఎక్కువ మంది విద్యార్థులను ఇదే భయం వెంటాడుతోందని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) తాజా సర్వే వెల్ల డించింది. అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో (అసహన ధోరణి పెరగడం, జాతి వివక్ష దాడులు పెరిగిన నేపథ్యంలో) తమ వ్యక్తిగత భద్రతపై భారతీయ విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఈ ఆందోళన ప్రభావం కనబడుతోందని.. భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా ఈసారి తగ్గొచ్చని సర్వేలో పాల్గొన్న 20 శాతం అమెరికా విద్యా సంస్థలు పేర్కొన్నాయి.


‘భారతీయ విద్యార్థుల్లో భద్రతపై ఆందోళన ఎక్కువగా ఉందనేది సుస్పష్టం. విద్యాసంస్థల్లో ప్రవేశం మొదలుకుని.. అడ్మిషన్‌ ఖరారయ్యేంతవరకు భారతీయ విద్యార్థులతో తాము జరిపే సంప్రదింపుల్లో ఈ ఆందోళన గమనించామని 80శాతం విద్యాసంస్థలు తెలిపాయి. అమెరికన్లు తమ రాకను స్వాగతించరేమోననే ఆందోళన కూడా భారతీయ విద్యార్థుల్లో ఉందని 31 శాతం వర్సిటీలు వెల్లడించాయి’ అని సర్వే పేర్కొంది. అయితే దరఖాస్తుల సంఖ్య మాత్రం తగ్గలేదని వెల్లడించింది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు చైనా నుంచి ఉండగా రెండోస్థానం భారత్‌దే. 2016లో భారత్‌ నుంచి 1,65,000 మంది విద్యార్థులు వివిధ అమెరికా వర్సిటీల్లో ఉన్నారు.


మొత్తం అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో ఇది 16 శాతం. మొత్తం పదిలక్షల పైచిలుకు విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసిస్తున్నారు. వీరిద్వారా రూ.2.31 లక్షల కోట్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేరుతున్నాయి. అలాంటప్పుడు విదేశీ విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొనడం మంచిది కాదని సర్వే అభిప్రాయపడింది. ఈసారి భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గవచ్చని 20 శాతం వర్సిటీలు పేర్కొన్నాయి. ముస్లిం వ్యతిరేకత పెరుగుతున్నందువల్ల పశ్చిమాసియా దేశాల నుంచి కూడా విద్యార్థులు మునుపటిలా రాకపోవచ్చని 31 శాతం వర్సిటీలు భావిస్తున్నాయి.


భారతీయ విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో పెద్దగా తేడా కనిపించకపోయినా (గతంతో పోలిస్తే) వర్సిటీల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గొచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విదేశీ విద్యార్థుల చేరికలో 2 శాతం లోటు కనిపించింది. 112 విద్యాసంస్థలు ఈ సర్వేలో పాల్గొని ఐఐఈకి గణాంకాలను అందించాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఐఐఈ సంస్థను 1919లో స్థాపించారు. అంతర్జాతీయ విద్యార్థుల మార్పిడి, సహాయం, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయంగా శాంతి, భద్రతల అంశాలపై ఈ సంస్థ పనిచేస్తుంది.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top