భారతీయ డిగ్రీలకు యూఏఈ గుర్తింపు

Indian Degrees to Get Equivalency in UAE - Sakshi

దుబాయ్‌: యూఏఈలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు శుభవార్త. భారతీయ వర్సిటీలు జారీ చేసే డిగ్రీ పట్టాలను గుర్తిస్తూ యూఏఈ ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. భారతీయ వర్సిటీలు ఇచ్చే సర్టిఫికెట్లలో ఇంటర్నల్‌/ఎక్స్‌టర్నల్‌ మార్కుల జాబితా ఉంటుంది. దీన్లో ఎక్స్‌టర్నల్‌ మార్కులపై యూఏఈ సంస్థలు పలు సందేహాలు వ్యక్తం చేస్తూ అభ్యర్థులను తిరస్కరిస్తున్నాయి. ఇలాంటి పలు ఘటనలు వెలుగులోకి రావడంతో కొంతకాలంగా భారత ప్రభుత్వం అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

తాజాగా భారత రాయబారి నవ్‌దీప్‌ సింగ్‌ సూరి యూఏఈ విద్యామంత్రి హుస్సేన్‌ బిన్‌ ఇబ్రహీంతో సమావేశమై భారతీయ వర్సిటీల్లో ఇంటర్నల్‌/ఎక్స్‌టర్నల్‌ మార్కుల విధానాన్ని వివరించారు. ఎక్స్‌టర్నల్‌ మార్కులంటే మూల్యాంకన విధానమే తప్ప, చదువుకున్న ప్రాంతం కాదని ఆయనకు స్పష్టతనిచ్చారు. దీంతో భారతీయ వర్సిటీల డిగ్రీలను గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే తిరస్కరణకు గురైన భారతీయ అభ్యర్థుల దరఖాస్తులను మళ్లీ సమీక్షించేందుకు కూడా ఆయన అంగీకరించారని యూఏఈ విద్యాశాఖ తెలిపింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top