హెచ్‌1బీ వీసా మోసం 

H1B Visa Fraud - Sakshi

అమెరికాలో నలుగురు ఇండో అమెరికన్ల అరెస్ట్‌

వాషింగ్టన్‌: అమెరికాలో విదేశీ నిపుణులకు జారీచేసే హెచ్‌1బీ వీసాల ప్రక్రియలో మోసానికి పాల్పడిన నలుగురు భారత సంతతి అమెరికన్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తప్పుడు ధ్రువపత్రాలతో విజయ్‌ మానే(39), వెంకటరమణ మన్నెం(47), ఫెర్నాండో సిల్వ(53), సతీశ్‌ వేమూరి(52) వీసా మోసానికి పాల్పడ్డారని న్యాయశాఖ అధికారులు తెలిపారు. ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టు ముందు హాజరుపరచగా, రూ.1.72 కోట్ల(2.50 లక్షల డాలర్ల) పూచీకత్తుపై వీరికి న్యాయస్థానం బెయిల్‌ మంజారుచేసింది.

ఈ విషయమై అమెరికా న్యాయశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘విజయ్‌ మానే, మన్నెం వెంకటరమణ, సతీశ్‌ వేమూరి కలిసి న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్‌ ప్రాంతంలో ప్రొక్యూర్‌ ప్రొఫెషనల్స్‌ ఇంక్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ ఇంక్‌ అనే స్టాఫింగ్‌ కంపెనీలను ప్రారంభించారు. అదే సమయంలో ఫెర్నాండో సిల్వ, మన్నెం వెంకటరమణ కలిసి ‘క్లయింట్‌ ఏ’ అనే మరో సంస్థను మొదలుపెట్టారు. ఐటీ కంపెనీలకు నిపుణులైన సిబ్బందిని ఈ సంస్థలు సిఫార్సు చేయడంతో పాటు వారి తరఫున హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తు చేస్తాయి. అయితే ప్రొక్యూర్‌ ప్రొఫెషనల్స్‌ ఇంక్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ ఇంక్‌ ఇక్కడే మోసానికి తెరలేపాయి.

తమ ఏజెన్సీల తరఫున హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసిన విదేశీయులకు ఇప్పటికే ‘క్లయింట్‌ ఏ’ సంస్థలో ఉద్యోగాలు లభించాయని తప్పుడు పత్రాలు సృష్టించాయి. దీంతో మిగతా వీసా దరఖాస్తుల కంటే ఈ రెండు సంస్థల తరఫున దాఖలైన హెచ్‌1బీ వీసాలు త్వరితగతిన ఆమోదం పొందాయి. తద్వారా ఇతర స్టాఫింగ్‌ కంపెనీలతో పోల్చుకుంటే ప్రొక్యూర్‌ ప్రొఫెషనల్స్‌ ఇన్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ ఇన్‌ సంస్థలు అనుచితంగా లబ్ధిపొందాయి’ అని తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top