‘నేను అమరుడినైనా సరే.. కంచె దాటుతా’

Three Palestinians killed And Many wounded At Gaza border  - Sakshi

గాజా, పాలస్తీనా : ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దులో పాలస్తీనియన్లు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. శరణార్థులను తిరిగి ఇజ్రాయెల్‌లోకి అనుమతించాలంటూ ఆరు వారాల పాటు నిరసన వ్యక్తం చేయాలని పాలస్తీనియన్‌ సున్ని ముస్లిం సంస్థ ‘హమాస్‌’ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగాయి.

టైర్లను మండించడం ద్వారా పొగ వ్యాప్తి చేసి సైనికుల దృష్టిని మళ్లించి కంచెను తొలగించాలని నిరసనకారులు ప్రయత్నించారు. అంతేకాకుండా వారిపై రాళ్లు విసరడంతో ఇజ్రాయెల్‌ సైనికులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపారు.

వారం క్రితం ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో సైనికుల కాల్పుల్లో ఇప్పటికే 20 మంది పాలస్తీనియన్లు మరణించారు. ‘ద ఫ్రైడే ఆఫ్‌ ఓల్డ్‌ టైర్స్‌’ పేరిట శుక్రవారం చేపట్టిన నిరసనలో మరో ముగ్గురు మరణించగా.. సుమారు 250 మంది తీవ్రంగా గాయపడ్డారు.

‘హమాస్‌ దాడులను ప్రోత్సహిస్తోంది’..
ఈ నిరసనలో మరణించిన వారి కుటుంబానికి 3 వేల డాలర్లు, తీవ్రంగా గాయపడిన వారికి 5 వందల డాలర్లు, గాయపడిన వారికి 2 వందల డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని హమాస్‌ ప్రకటించింది. హమాస్‌ నిర్ణయం దాడులను ప్రోత్సహించేలా ఉందని ఇజ్రాయెల్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మా ఆవేదన పట్టించుకోరా...
బాంబు దాడులు, సైనికుల కాల్పులు, నిరసనలతో రణరంగంగా మారిన గాజా ఎల్లప్పుడూ పౌరుల ఆర్తనాదాలతో మారుమోగుతూనే ఉంటుంది. అయినా వారు వెనకడుగు వేయకుండా తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం విడిచి వెళ్లి, కష్టాలు అనుభవిస్తున్న యూధు శరణార్థులను తిరిగి దేశంలోకి అనుమతించాలంటూ పాలస్తీనియన్లు సరిహద్దులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

‘ఈరోజు నేను అమరుడినైనా సరే.. కంచె దాటుతానంటూ’ సైనికుల చేతుల్లో గాయపడిన 20 ఏళ్ల అహ్మద్‌ ఘాలీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘గత వారం జరిగిన కాల్పుల్లో నేను గాయపడ్డాను.. కానీ ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఇక్కడికి చేరుకున్నాను. మా పోరాటం ఆగదంటూ’ ఖాన్‌ యూనిస్‌ అనే పాలస్తీనియన్‌ బాధ వెళ్లగక్కాడు. ‘మా ప్రాణాలు పోయినా సరే.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరం నిరసన వ్యక్తం చేస్తాం. ఎందుకంటే మేము బలహీనులం కాదని నిరూపించాలనుకుంటున్నాం’ అని మరో  నిరసనకారుడు హెచ్చరించాడు.

ఇది చట్ట విరుద్దం..
సరిహద్దులో నిరసన తెలపడం ద్వారా ప్రాణాలు ప్రమాదంలో పడతాయంటూ ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి నిరసనకారులను హెచ్చరించారు. పాలస్తీనియన్ల పట్ల ప్రభుత్వ తీరును ఖండించిన హక్కుల సంఘాలను ఉద్దేశించి.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు.

దీనిని ఖండిస్తున్నాం.. : అమెరికా రాయబారి
సరిహద్దు ప్రాంతం నుంచి వెళ్లిపోవాల్సిందిగా పాలస్తీనియన్లను శ్వేత సౌధ రాయబారి కోరారు. ‘హింసకు పాల్పడాలని పిలుపునిచ్చిన నాయకులు చిన్నారులను కూడా ఈ నిరసనలోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. అమెరికా దీన్ని ఎంత మాత్రం సహించదని, ఈ చర్యలను ఖండిస్తున్నాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top