ఇండోనేసియాను మరోసారి వణికించిన భూకంపం

Earthquake Strikes Sumba Island - Sakshi

జకర్తా: ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి కన్నెర చేసింది. ఇటీవల సులవేసి ద్వీపంలో సంభవించిన భూకంపం, సునామీ ధాటికి మరభూమిని తలపిస్తున్న ఇండోనేసియాకు మరో షాక్‌ తగిలింది. మంగళవారం ఉదయం సుంబా దీవిలో 15 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. తొలుత రిక్టర్‌ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 15 నిమిషాల్లోపే మరోసారి రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. సులవేసి దక్షిణాన 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంబా దీవిలో 7.5 లక్షల మంది జనాభా ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు శుక్రవారం సులవేసి ద్వీపాన్ని అతలాకుతలం చేసిన సునామీ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే అధికారంగా 832 మంది చనిపోయినట్టు ప్రకటించినప్పటికీ అనధికారిక సమాచారం ప్రకారం  ఈ సంఖ్య దాదాపు 1200కు చెరినట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్న రెడ్‌ క్రాస్‌ సిబ్బంది సిగి జిల్లాలో ఓ కూలిన చర్చి భవనం కింద 34 మంది విద్యార్థుల మృతదేహాలను కనుగొన్నారు. ఆ చర్చి ట్రెనింగ్‌ సెంటర్‌లో విపత్తు సంభవించిన సమయంలో మొత్తం 86 మంది విద్యార్థులు బైబిల్‌ చదువుతున్నారని భావిస్తున్నారు. దీంతో గల్లంతైన 52 మంది విద్యార్థుల కోసం సిబ్బంది ముమ్మరంగా గాలింపు  చేపట్టారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top