వాళ్లకు శుభ్రత గురించి తెలుసా : ట్రంప్‌

Donald Trump Says India China Russia Have No Sense Of Pollution - Sakshi

లండన్‌ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై మరోసారి నోరు పారేసుకున్నారు. తమ దేశంలాగా మరే ఇతర దేశం పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం లేదంటూ ఆత్మస్తుతి చేసుకున్నారు. ఈ క్రమంలో చైనా, రష్యా వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. తన మూడు రోజుల బ్రిటన్‌ పర్యటనలో భాగంగా ట్రంప్‌ బుధవారం బ్రిటన్‌ రాజు ప్రిన్స్‌ చార్లెస్‌ను కలిశారు. ఈ క్రమంలో పర్యావరణం, వాతావరణ మార్పు తదితర అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు.

ఈ సమావేశం అనంతరం ఓ బ్రిటీష్‌ చానల్‌తో మాట్లాడుతూ.. ‘ మొదట 15 నిమిషాల పాటే ఆయన(ప్రిన్స్‌ చార్లెస్‌)తో సమావేశమవ్వాలని భావించాను. కానీ ఆయన మాటలు, పర్యావరణం పట్ల ఆయనకు ఉన్న అవగాహన చూసి గంటన్నర సేపు అలాగే కూర్చుండిపోయాను. నిజానికి ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణలో అమెరికా ముందు వరుసలో ఉంటుంది. గణాంకాలు కూడా ఇవే చెబుతున్నాయి. భారత్‌, చైనా, రష్యా వంటి దేశాలకు అసలు ఈ విషయంపై ధ్యాసే లేదు. కాలుష్యం, శుభ్రత పట్ల కొంచెం కూడా అవగాహన ఉండదు. ఆ దేశాల్లో స్వచ్ఛమైన గాలి, నీరు అసలే ఉండవు. ఇక శుభ్రమైన పరిసరాలు సరేసరి. భారత్‌, చైనా దేశాల్లో కొన్ని సిటీల గురించి అస్సలు మాట్లాడకపోవడమే మంచిది. మీరు అక్కడికి వెళ్లినట్లైతే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. అక్కడ గాలి పీల్చుకోవడం కూడా కష్టమే’ అని ట్రంప్‌ ఆసియా దేశాల గురించి హేళనగా మాట్లాడారు.

కాగా పర్యావరణ హితం కోసం అనుసరించాల్సిన విధానాలపై ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే. అదే విధంగా చాన్నాళ్ల క్రితమే మూతపడిన బొగ్గు ఆధారిత ఫ్యాక్టరీలను కూడా తిరిగి పనిచేసేలా ట్రంప్‌ సర్కారు అనుమతులు ఇచ్చింది. ఇక ప్రపంచ కర్బన ఉద్గారాలను అధికంగా వదిలే దేశాల్లో చైనా తర్వాత అమెరికా రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాలన్నీ బహిరంగ రహస్యమే అయినప్పటికీ ట్రంప్ మాత్రం సొంత డబ్బా కొట్టుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యధిక జనాభా కలిగి ఉండి, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లలో కాలుష్యం ఉన్న మాట నిజమే గానీ.. తక్కువ జనాభా ఉండి కూడా అత్యధిక కర్బన ఉద్గారాలను విడుదల చేసే అమెరికాతో పోలిస్తే మాత్రం ఇవి కాస్త బెటరే అంటూ ట్రంప్‌ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top