అమెరికా ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా భారతీయ సంతతి వ్యక్తి

Donald Trump Appointed Neil Chatterjee As US FERC Chairman - Sakshi

 ట్రంప్‌ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన వైట్‌ హౌస్‌..

అమెరికా ఫెడరల్‌ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్‌(ఎఫ్‌ఈఆర్‌సీ) ఛైర్మన్‌గా భారతీయ సంతతికి చెందిన నెయిల్‌ ఛటర్జీని అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌ నియమించారు. అమెరికా పవర్‌ గ్రిడ్, వేలకోట్ల డాలర్ల విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు ఎఫ్‌ఈఆర్‌సీ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా ఉన్న కెవిన్‌ మేక్‌ ఇంటైర్‌ స్థానంలో భారతీయసంతతికి చెందిన నైయిల్‌ ఛటర్జీ ని నియమించిన విషయాన్ని బుధవారం వైట్‌హౌస్‌ ప్రకటించింది. అనారోగ్య కారణాల రీత్యా మెక్‌ ఇంటైర్‌ ఈనెల 22వ తేదీన రాజీనామా చేయడంతో ఇప్పటికే ఎఫ్‌ఈఆర్‌సీ కమిషనర్‌గా కొనసాగుతోన్న ఛటర్జీని ట్రంప్‌ ఆ స్థానంలో భర్తీ చేస్తూ నిర్ణయం చేసారు. ఛటర్జీ ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌ బాధ్యతలు నిర్వర్తించడం ఇది రెండోసారి. గతంలో మెక్‌ ఇంటైర్‌ ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించకముందు 2017 ఆగస్టు 10 నుంచి డిసెంబర్‌ 7 వరకు ఛటర్జీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. 

అమెరికా సెనేట్‌ మెజారిటీ నాయకుడు మిచ్‌ మెక్‌ కన్నెల్‌కి ఛటర్జీ విద్యుత్‌ విధాన సలహాదారుగా పనిచేస్తున్న సందర్భంలో మేజర్‌ విద్యుత్‌ విధానాలూ, రహదారుల కు సంబంధించిన చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 50 ఏళ్ళ క్రితమే కలకత్తా నుంచి ఛటర్జీ కుటుంబం అమెరికాకు చేరింది. లగ్జింగ్టన్, కెంటక్కీలో నివసించే ఛటర్జీ సెయింట్‌ లారెన్స్‌ యూనివర్సిటీ నుంచీ  యూనివర్సిటీ ఆఫ్‌ సిన్‌సినాటి లా కాలేజ్‌ నుంచీ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసారు. 

మెక్‌ కన్నెల్‌కి సలహాదారుగా పనిచేయకముందు ఛటర్జీ ప్రభుత్వం తరఫున జాతీయ గ్రామీణ విద్యుత్‌ కోఆపరేటివ్‌ అసోసియేషన్‌ కి ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ఓహియోలోని రిపబ్లికన్‌ కాన్ఫరెన్స్‌ ఛైర్‌వుమన్‌ దబోరా ప్రైస్‌ కి సహాయకుడిగా పనిచేసారు. ప్రాజెక్టుల నిర్మాణాలకి అనుమతులివ్వడం, విద్యుత్‌ ధరల నిర్ణయం, సైబర్‌ సెక్యూరిటీ, డిఫెన్స్‌ రంగాల్లో ఎఫ్‌ఈఆర్‌సీ ది కీలక పాత్ర. ఎఫ్‌ఈఆర్‌సీ ప్రభుత్వ విద్యుత్‌ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top