1000 కోట్లు  పాయే!

A crypto exchange may have lost $145 million after its CEO suddenly died - Sakshi

పాస్‌వర్డ్‌ చెప్పకుండా మృతిచెందిన క్రిప్టో కరెన్సీ సంస్థ సీఈవో

హ్యాక్‌ చేయలేక ఐటీ నిపుణుల తర్జనభర్జన

సొమ్ముల సంగతేంటని ఇన్వెస్టర్ల లబోదిబో  

ఒక వ్యక్తి మరణం లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టేసింది. ఏకంగా 19 కోట్ల కెనడా డాలర్ల (రూ.1,030 కోట్లు) సొమ్ము ఫ్రీజ్‌ అయిపోయింది. ఈ డబ్బును ఎలా వెనక్కి తీసుకురావాలో తెలియక టెక్‌ దిగ్గజాలు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే క్రిప్టో కరెన్సీ అంటే తెలుసు కదా. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లుబాటు అయ్యే డిజిటల్‌ కరెన్సీ. దీనిలో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని ఈ మధ్య కాలంలో చాలామంది దానివైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు ఆహ్వానించే ఒక కంపెనీయే కెనడాకు చెందిన క్వాడ్రిగాసీఎక్స్‌. సంస్థ ప్రస్తుత సీఈవో అయిన కెనడాకు చెందిన గెరాల్డ్‌ కాటన్‌ 5 ఏళ్ల కిందట నోవా స్కాటియాలో దీనిని స్థాపించారు. దీంతో ఈ కంపెనీలో ఎందరో ఇన్వెస్టర్లు తమ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో డిపాజిట్లు చేశారు. 

భారత్‌లోనే మరణం..
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. అసలు చిక్కల్లా గతేడాది డిసెంబర్‌లో మొదలైంది. గత డిసెంబర్‌లో ఏదో పనుల నిమిత్తం కాటన్‌ భారత్‌కు వచ్చారు. 30 ఏళ్ల వయసున్న ఆయనకి అప్పటికే జీర్ణకోశ వ్యాధి బాగా ముదిరిపోయింది. మన దేశంలో పర్యటిస్తుండగానే ఆకస్మికంగా కాటన్‌ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా క్వాడ్రిగాసీఎక్స్‌లో పెట్టుబడి పెట్టినవారిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన డిజిటల్‌ వాలెట్‌ పాస్‌వర్డ్‌లు, రికవరీ కీలు కాటన్‌కు తప్ప మరెవరికీ తెలీదు. ఆయన వాటిని ఎక్కడా రాసి పెట్టి కూడా ఉంచలేదు. దీంతో కోట్లాది డాలర్లను ఎలా రికవరీ చేసుకోవాలో తెలియక ఇన్వెస్టర్లంతా లబోదిబోమంటున్నారు. ఆ పాస్‌వర్డ్‌లను కనుక్కోవడానికి సాంకేతిక నిపుణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు మాత్రం శూన్యం.

అతి భద్రతే  కొంప ముంచింది
డిజిటల్‌ కరెన్సీ అంటే అన్నీ ఆన్‌లైన్‌ లావాదేవీలే కాబట్టి గెరాల్డ్‌ కాటన్‌ భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉండేవారు. తాను వాడే ల్యాప్‌టాప్‌లు, ఈ మెయిల్, మొబైల్‌ ఫోన్లు, మెసేజింగ్‌ వ్యవస్థలన్నింటినీ ఎన్‌క్రిప్ట్‌ చేసేశారు. దీంతో ఆ పాస్‌వర్డ్‌లను కనుక్కోవడంలో ఐటీ దిగ్గజాలు కూడా చేతులెత్తేశారు. డిజిటల్‌ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా, ఎవరూ వాటిని హ్యాక్‌ చేయకుండా కాటన్‌ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయితే ఇంతటి పకడ్బందీ భద్రతా చర్యల కారణంగా తాము ఆ సొమ్మును రికవరీ చేసే పరిస్థితుల్లో లేమంటూ ఆయన భార్య జెన్నిఫర్‌ రాబర్ట్‌సన్‌ కోర్టులో అఫిడవిట్‌ సమర్పించారు. ఇప్పుడు ఇన్వెస్టర్లు మాత్రం చేసేదేమీలేక న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు. అయితే కొందరు ఇన్వెస్టర్లేమో ఈ కంపెనీ కుట్ర పన్ని తమను మోసం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో క్వాడ్రిగాసీఎక్స్‌ డిపాజిట్లు ఆన్‌లైన్‌లో చేతులు మారుతున్నాయని, పాస్‌వర్డ్‌లు తెలీకుండా అదెలా జరుగుతోందంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఒక వ్యక్తి మరణంతో రూ.1,000 కోట్లకు పైగా సొమ్ముకి అతీగతీ లేకపోవడం విస్మయం కలిగించే విషయమే. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top