వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం

Covid Antibodies Fade Rapidly Raising Risk Of Lost Immunity - Sakshi

బ్లూమ్‌బెర్గ్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: చైనాలోని వుహాన్‌లో ప్రారంభమై అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌ కరోనా. దీనిని మొదట్లో న్యూమోనియా లాంటి అనారోగ్యానికి కారణమయ్యే వైరస్‌ అని భావించినప్పటికీ, ఈ విధంగా తీవ్ర రూపం దాలుస్తుందని పరిశోధకులు, వైద్యనిపుణులు ఊహించలేకపోయారు. ఆరు నెలల కాలంలోనే వైరస్‌ ప్రపంచాన్ని చుట్టేసింది. కరోనా వైరస్ అంటే నిన్నటి వరకూ మనకు తెలిసిన లక్షణాలు చాలా తక్కువ. దగ్గు, జ్వరం ఉంటాయని, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని మాత్రమే.

ఆ తరువాత రుచి లేకపోవడం, వాసన కోల్పోవడం కొత్తగా చేరిన లక్షణాలు. ఇలా రోజుకో వ్యాధి లక్షణం, కొత్త సమస్య బయటపడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో కరోనా నివారణకు అందించే టీకా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని కలిగిఉండేలా ప్రభావవంతంగా ఉంటుందా..? లేక శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాలకు ఏమి జరుగుతుంది. శరీరంలో వైరస్‌ పునర్నిర్మాణం సాధ్యమా వంటి అనేక అనుమానాలు సగటు మానవుడి మెదడుని తొలుస్తున్నాయి. (చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్‌)

అయితే బ్లూమ్‌బెర్గ్‌ సంస్థ అందించిన నివేదిక ప్రకారం.. కోవిడ్‌ నుంచి కోలుకున్నవారికి లేదా తేలికపాటి వ్యాధి లక్షణాలు ఉన్న వారికి భవిష్యత్తులో అంటువ్యాధుల నుంచి శాశ్వత రక్షణ లభించకపోవచ్చని రోగనిరోధక శక్తి, టీకాల మన్నికను అర్థం చేసుకోవడానికి నిర్వహించిన ఓ అధ్యయం సూచిస్తుంది. తేలికపాటి కోవిడ్‌ లక్షణాలు కలిగి ఉన​ 34 మంది రోగుల రక్తం నుంచి ప్రతిరోధకాలు తీసుకోగా వారికి ఇంటెన్సివ్‌ కేర్‌ అవసరం రాలేదు. కేవలం ఆక్సిజన్‌, హెచ్‌ఐవీ ఔషదాలు, రెమెడిసివిర్‌ మాత్రమే ఇచ్చారు. లక్షణాలు ప్రారంభమైన 37 రోజుల తర్వాత తీసుకున్న ప్రతిరోధకాలను మొదట విశ్లేషించగా, తర్వాత 86 రోజుల తర్వాత మరొక విశ్లేషణ చేశారు. (చైనా టీకా ఫలితాలూ భేష్‌!)

పై రెండు ఫ్రేమ్‌ల మధ్య సుమారు 73 రోజుల తర్వాత యాంటీబాడీ స్థాయిలు త్వరగా పడిపోయాయని పరిశోధకులు కనుగొన్నారు. 2002-03లో వచ్చిన సార్స్‌తో పోలిస్తే కరోనా యాంటీబాడీస్‌ను కోల్పోవడం చాలా వేగంగా జరిగిందని గుర్తించారు. వీరి అధ్యయంలో ముఖ్యంగా స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి శాశ్వత కోవిడ్‌ యాంటీబాడీస్‌ ఉండకపోవచ్చని గుర్తించారు. వైరస్‌ను అడ్డుకోవడంలో యాంటీబాడీలు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారిన పడినవారిలో చాలా వరకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వీరికి భవిష్యత్తులో కూడా తిరిగి ఈ వైరస్‌ సోకే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్‌ అధ్యయనంలో తేలింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top