వైరస్‌ మరణాలు 13 వేలు

COVID-19 virus is spreading across the world - Sakshi

ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల పాజిటివ్‌ కేసులు

170 దేశాలకు వ్యాపించిన కోవిడ్‌ 

ఇటలీలో 651 మంది మృతి

రోమ్‌/ప్యారిస్‌/లండన్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఊహించనంత వేగంతో విస్తరిస్తున్న ఈ మహమ్మారితో ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. వారాంతపు సెలవుల్లో గడపాల్సిన కోట్లాది మంది ప్రజలు కోవిడ్‌ భయంతో ఆదివారం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదివారం యావత్‌ భారత్‌ లాక్‌డౌన్‌ పాటించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై స్వయం కర్ఫ్యూ పాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,08,130 మందికి వ్యాధి సోకగా ఆదివారం ఒక్కరోజే 1,702 మృతి చెందడంతో మొత్తం మరణాలు 13,444కు చేరుకున్నాయి. వీరిలో ఒక్క ఇటలీ దేశస్తులే 651 మంది ఉన్నారు. సుమారు 170 దేశాలకు వైరస్‌ వ్యాపించగా దీని విస్తృతిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో 100 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. 35 దేశాలు సరిహద్దులను మూసి వేసుకున్నాయి. అయితే, మరణాలు, బాధితుల సంఖ్య వెల్లడించిన వాటికంటే ఎక్కువగానే ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఉండగా, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ వద్ద పనిచేసే ఉద్యోగిని కూడా వైరస్‌ సోకినట్లు తేలడంతో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. (ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. కరోనాకు విరుగుడు..!)

బయటకు వస్తే జరిమానా
యూరప్‌ మొత్తమ్మీద 1,52,117 కరోనా కేసులు నిర్ధారణ కాగా అందులో ఒక్క ఇటలీలోనే 59 వేల వరకు ఉన్నాయి. ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్‌ ఇతర యూరప్‌ దేశాల ప్రభుత్వాలు తమ పౌరులను ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించాయి. బయటకు వచ్చిన వారిపై జరిమానాలు తప్పవని హెచ్చరించాయి. యూరప్‌లో మరణాల సంఖ్య 7,802 కాగా తీవ్రంగా ప్రభావితమైన ఒక్క ఇటలీలోనే ఆదివారం 651 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,476కు చేరుకుంది. ప్రపంచవ్యాప్త మరణాల్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో అన్ని అత్యవసరేతర సంస్థలను మూసివేయాలని ఇటలీ ప్రధాని గిసెప్‌ కాంటే ఆదేశించారు. స్పెయిన్‌లో 24 గంటల వ్యవధిలో 394 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాలు 1,720కు చేరుకున్నాయి. ఫ్రాన్సులో మొత్తం 562 మంది కోవిడ్‌తో చనిపోయారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరాలను సరఫరా చేసేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు ఫ్రాన్సు అధికారులు ప్రకటించారు. బ్రిటన్‌లో 233 మంది కోవిడ్‌తో చనిపోయారు. పబ్‌లు, రెస్టారెంట్లు, థియేటర్లు మూసివేయాలని, తొందరపడి ఎడాపెడా నిత్యావసరాలను కొనవద్దని పౌరులను బ్రిటన్‌ కోరింది.

అమెరికాలో...
అగ్రరాజ్యం అమెరికాలో ఆదివారం 47 మంది చనిపోగా మొత్తం మృతులు 349, కేసుల సంఖ్య 26,747కు చేరుకుంది. న్యూయార్క్, షికాగో, లాస్‌ఏంజెలెస్‌ నగరాలు సహా మూడో వంతు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మిగతా ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్, ఆయన భార్యకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందని  అధికారులు తెలిపారు.

ఆసియాలో..
ఆసియా ఖండంలో 96,669 కేసులు బయటపడగా 3,479 మరణాలు నమోదయ్యాయి. వ్యాధికి మూల కేంద్రమైన చైనాలో ఆదివారం ఒక్క కేసు మాత్రమే బయటపడింది. థాయ్‌ల్యాండ్‌లో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్‌ కేసులతో మొత్తం సంఖ్య 600కు పెరిగింది. మధ్యప్రాచ్యంలోనూ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే ఇరాన్‌లో 123 మంది చనిపోగా మొత్తం మరణాలు 1,685కు చేరుకున్నాయి.  పాకిస్తాన్‌లో పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు., తమ దేశం పరిస్థితి ఇటలీ మాదిరిగా ఘోరంగా లేదన్నారు. పూర్తి లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బందులు పడతారని తెలిపారు. ఆస్ట్రేలియా సరిహద్దులను మూసివేసింది. ఆఫ్రికాలో 1,100 కేసులు ఇప్పటివరకు వెలుగుచూశాయి.  

రాణి సహాయకురాలికి కరోనా పాజిటివ్‌
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ (93)కు సహాయకురాలు ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్‌ వ్యాప్తి భయంతో లండన్‌లోని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ అధికారులు రాణిని ముందు జాగ్రత్తగా ఇటీవలే విండ్సర్‌ కేజిల్‌కు తరలించారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. రాణి విండ్సర్‌కు వెళ్లకముందే ఆ సహాయకురాలికి వైరస్‌ సోకినట్లు మీడియా తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top