భౌతిక దూరం లేకుంటే.. మాస్క్‌ వేస్ట్‌!

Coronavirus: Without Social Distance Masks are Waste CDC Says - Sakshi

సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ తాజా మార్గదర్శకాలు

మాస్క్‌తో పాటు భౌతిక దూరం తప్పనిసరి

లక్షణాలు లేకున్నా కరోనా వచ్చే అవకాశం అధికం

కనీసం రెండు మీటర్లు దూరంగా ఉండాలన్న సీడీసీ

సాక్షి, హైదరాబాద్‌ : ‘కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవాలి. మాస్క్‌ ధరించాలి’అని మొదటి నుంచీ వైద్య నిపుణులు చెబుతున్న విషయాలే. ఈ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది. వీటిల్లో ఏది పాటించకపోయినా కరోనా బారిన పడే ప్రమాదముందనేది అందరికీ తెలిసిందే. మాస్క్‌ పెట్టుకున్నాం కదా అని చాలామంది కలసిమెలసి తిరుగుతుంటారు. అయితే భౌతిక దూరం పాటించకుండా మాస్క్‌ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) స్పష్టం చేసింది. మాస్క్‌.. భౌతిక దూరానికి ప్రత్యామ్నాయం కాదని తేల్చి చెబుతూ.. భౌతిక దూరానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించింది. కాబట్టి మాస్క్‌తో పాటు తప్పనిసరిగా భౌతికదూరాన్ని పాటించా లని పేర్కొంది. అవసరమైన పనులను చేస్తున్నప్పుడు, కార్యాలయంలోకి వెళ్తున్నప్పుడు 6 అడుగుల భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమని పేర్కొంది. ఈ మేరకు కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి మార్గదర్శకాలు జారీచేసింది.

లక్షణాలు లేకున్నా వైరస్‌..
చాలా మందిలో కరోనా వైరస్‌ లక్షణాలు బయటకు కనిపించట్లేదు. వారివల్ల కరోనా వ్యాప్తి చెందినట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అందువల్ల లక్షణాలు లేవని భావించి ఎవరితోనూ సన్నిహితంగా మెలగొద్దు. దీనివల్ల ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్‌ ప్రధానంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. అందువల్ల ఎవరితోనూ సన్నిహిత సంబంధాలను కొనసాగించొద్దు. వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ములు లేదా మాట్లాడేటప్పుడు వెలువడే శ్వాస బిందువులు సమీపంలో ఉన్న వారి నోట్లో లేదా ముక్కులో పడొచ్చు. ఒక్కోసారి ఊపిరి తిత్తుల్లోకి కూడా నేరుగా వెళ్లే అవకాశం ఉంది. ఇంట్లోనూ అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించండి. వీలైతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, ఇతర ఇంటి సభ్యుల మధ్య ఆరు అడుగుల ద్వారాన్ని పాటించాలి. అలాగే ఇంటి బయట ఎవరైనా వస్తే వారితోనూ భౌతిక దూరం పాటించాలి. గుంపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగొద్దు. కరోనా వైరస్‌ వ్యాధిని నివారించడానికి ప్రస్తుతం టీకా లేదు. కాబట్టి దాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం ఈ వైరస్‌ బారిన పడకుండా అన్ని విధాలా జాగ్రత్తగా ఉండటమే. 

రెండేళ్లలోపు పిల్లలకు ఇబ్బంది..
రెండేళ్లలోపు వయసున్న చిన్న పిల్లలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారు లేదా అపస్మారక స్థితిలో ఉన్న వారు, ఇతరత్రా సమస్యలున్న వారు మాస్క్‌లు ధరించకపోవడమే మంచిది. అలాంటి వారికి బదులు పక్కనున్న వ్యక్తులు ధరిస్తే, వారికి ఎలాంటి హాని ఉండదు. వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటిస్‌ వంటి తీవ్రమైన అనారోగ్యం ఉన్న వారు కరోనా వైరస్‌కు ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల్లోనూ వీరే బాధితులుగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

అప్పుడు చెక్‌ చేసుకోవద్దు..
వ్యాయామం చేసిన 30 నిమిషాల్లో లేదా ఉష్ణోగ్రతను తగ్గించే మందులు తీసుకున్న తర్వాత థర్మల్‌ (జ్వర) పరీక్షలు చేయకూడదు. దీనివల్ల స్పష్టమైన ఫలితం రాదు. జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది ఉంటే కరోనాగా అనుమానించాలి. లక్షణాలు ఉంటే శరీర ఉష్ణోగ్రత తప్పనిసరిగా చూడాలి. కార్యాలయంలో ఒక్కోసారి మాస్క్‌ లేనప్పుడు దగ్గు లేదా తుమ్ము వస్తే మోచేయి అడ్డం పెట్టుకోవాలి. ఆ తర్వాత చేతులను సబ్బునీరు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్య సిబ్బంది ఉపయోగించే ఫేస్‌మాస్క్‌ను ధరించొద్దు.

వస్తువులను క్రిమిసంహారకం చేయాలి..
రోజూ తాకే వస్తువులను, ఉపరితలాలను క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయాలి. టేబుల్స్, లైట్‌ స్విచ్‌లు, హ్యాండిల్స్, డెస్క్‌లు, ఫోన్లు, కీ బోర్డులు, మరుగుదొడ్లు, సింక్‌లు ఇలా అన్నింటినీ శుభ్రం చేయాలి. అందుకోసం క్రిమిసంహారక డిటర్జెంట్‌ లేదా సబ్బు వంటివి వాడాలి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top