చైనా హెచ్చరికలు: కజకిస్థాన్‌ స్పందన!

China Warns Citizens Over Unknown Pneumonia Causes Fatalities In Kazakhstan - Sakshi

కజకిస్థాన్‌లో ప్రాణాంతక వైరస్‌ విజృంభిస్తోందన్న చైనా ఎంబసీ

ఆ వార్తలన్నీ వట్టి పుకార్లేనన్న కజకిస్థాన్‌

 

నూర్‌ సుల్తాన్‌/బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ చైనా మరో బాంబు పేల్చింది. సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్‌ సోకి న్యుమోనియాతో గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్‌-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న చైనీయులను హెచ్చరించింది. (భయపెట్టే వార్త చెప్పిన చైనా!)

ఈ మేరకు.. ‘‘కజకిస్థాన్‌లో ప్రాణాంతక కరోనా వైరస్‌ కంటే అంతుపట్టని న్యుమోనియాతో సంభవిస్తున్న మరణాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్నెళ్లుగా 1772 మంది మరణించారు. ఒక్క జూన్‌ నెలలోనే 628 మంది మృతి చెందారు. ఇందులో చైనీయులు కూడా ఉన్నారు. ఈ దేశ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వైరస్‌ ఆనవాలును కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతరకు దానిని గుర్తించలేకపోయారు. అందరూ జాగ్రత్తగా ఉండండి’’అని కజకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. (కరోనాతో మరో ముప్పు)

ఖండించిన కజకిస్థాన్‌
ఈ విషయంపై స్పందించిన కజికిస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. చైనా మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ మేరకు శుక్రవారం.. ‘‘కజకిస్థాన్‌లో సరికొత్త రకమైన న్యూమోనియా ప్రబలుతోందని కొన్ని చైనా మీడియా సంస్థలు ప్రచురించిన సమాచారం సరైంది కాదు’’అని ఓ ప్రకటన విడుదల చేసింది. బాక్టీరియా, ఫంగల్‌, వైరల్‌ న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయని.. తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. 

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాపై విమర్శలు కొనసాగుతుండగా.. కజకిస్థాన్‌లో కోవిడ్‌-19తో అనారోగ్యం బారిన పడిన వారి కంటే.. గుర్తు తెలియని వైరస్‌ కారణంగా మరణించేవారే ఎక్కువగా ఉన్నారంటూ డ్రాగన్‌ మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. చైనా ఎంబసీ హెచ్చరికలపై కజకిస్థాన్‌ విదేశాంగ మంత్రిని వివరణ కోరగా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది. కాగా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కజకిస్థాన్‌లో మార్చి 16న లాక్‌డౌన్‌ విధించగా.. మే నెలలో నిబంధనల్లో భారీ సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలో మరోసారి కేసుల సంఖ్య పెరగడంతో దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందని కజకిస్థాన్‌ అధ్యక్షుడు కసీం- జొమార్ట్‌ తోకాయేవ్‌ పేర్కొనడం గమనార్హం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top