గంటల తరబడి పనిచేస్తున్నారా... జాగ్రత్త! | Be aware of Computer vision syndrome disease, Research suggests working employees | Sakshi
Sakshi News home page

గంటల తరబడి పనిచేస్తున్నారా... జాగ్రత్త!

Feb 18 2016 3:52 PM | Updated on Sep 3 2017 5:54 PM

గంటల తరబడి పనిచేస్తున్నారా... జాగ్రత్త!

గంటల తరబడి పనిచేస్తున్నారా... జాగ్రత్త!

రోజంతా కంప్యూటర్లకు అతుక్కుపోవడం, గంటల తరబడి అదే పనిగా టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా పని చేయడం...

సాక్షి: రోజంతా కంప్యూటర్లకు అతుక్కుపోవడం, గంటల తరబడి అదే పనిగా టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా పని చేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 70 శాతం మంది ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. కళ్లు ఎరుపెక్కడం, కంట్లో నలుసు ఏర్పడటం, మంట, దురద, తడి ఆరిపోవడం, నీరు కారడం వంటి సమస్యలు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
 
నగరంలోని వాసన్, అగర్వాల్, ఎల్వీప్రసాద్, సరోజినిదేవి, మ్యాక్స్‌విజన్, తదితర కంటి ఆస్పత్రుల్లో ఈ సమస్యతో ప్రతి రోజూ 400కుపైగా కేసులు నమోదు అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
 
 రెప్పవాల్చకుండా వీక్షించడం వల్లే:
 నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మూడు లక్షలకుపైగానే ఉద్యోగులు పని చేస్తున్నట్లు ఓ అంచనా. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కంప్యూటర్ల వినియోగం తప్పని సరిగా మారింది. చివరికి షాపింగ్ మాల్స్‌లో కూడా వీటి వినియోగం పెరిగింది. కనురెప్ప వాల్చకుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్‌పై పని చేస్తుండటం వల్ల కళ్లు దెబ్బతింటున్నాయి. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ప్రతి వంద మందిలో 70శాతం మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ సుదాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

కంటిపై పెరుగుతున్న ఒత్తిడి వల్ల తీవ్రమైన ఇరిటేషన్‌కు గురవుతున్నారు. ప్రతి చిన్న అంశానికి చిరాకు పడుతున్నారు. ఇక పిల్లలు గేమ్స్ పేరుతో కంప్యూర్లకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి టీవీలను వీక్షిస్తుండంతో చూపు మందగించడం వల్ల పుస్తకంలోని అక్షరాలను కూడా పిల్లలు చదవలేక పోతున్నారు.  
 
కళ్లను కాపాడుకోవచ్చు ఇలా:
కనురెప్పవాల్చకుండా అదేపనిగా కంప్యూటర్‌పై పని చేయకూడదు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ స్క్రీన్ నుంచి దృష్టిని మరల్చాలి. కంట్లో మంట ఉన్నప్పుడు కనురెప్పలను రెండు చేతులతో మూసి అదిమిపట్టుకోవాలి. కంప్యూటర్ల ముందు కూర్చున్నప్పుడు ట్యూబ్ లైట్లు ఆర్పేయకూడదు. చీకట్లో పనిచేయడం వల్ల కంప్యూటర్ స్క్రీన్ కాంతి ప్రభావం నేరుగా కంటిపై పడుతుంది. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి 20 నుంచి 30సార్లు కళ్లను మూసి తెరవాలి. మానిటర్‌కు కళ్లు కనీసం రెండు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. కళ్లు దురదగా అన్పిస్తే చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా కంటిపై పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
 
 కంటికీ వ్యాయామం:
నిమిషానికి పదిసార్లు కళ్లు మూసి తెరవడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది. కనుగుడ్లను కిందికి, పైకి కనీసం పదిసార్లు కదిలించాలి. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి కనీసం 15సార్లు తిప్పాలి. ఎదురుగా ఉన్న గోడపై నల్లని గుర్తుపెట్టి దానిపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా చూపును మెరుగు పరుచుకోవచ్చు. మంచి నీరు, పళ్ల రసాలు బాగా తాగడం ద్వారా కన్నీటి సమస్యను కొంత వరకు జయించవచ్చు. రోజుకు ఎనిమిది గంటలు కంటి నిండా నిద్రపోవాలి. దోస కీర ముక్కలను కనురెప్పలపై ఉంచడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది. కనురెప్పల కలర్ కూడా మెరుగు పడుతుంది. ఈ సూచనలను పాటించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా కంటివైద్య విభాగం అధికారి డాక్టర్ రవీందర్‌గౌడ్ సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement