నేపాల్‌లో ఘోర ప్రమాదం

49 dead in US-Bangla plane crash at Kathmandu airport - Sakshi

విమానం కూలి 50 మంది దుర్మరణం

21 మందికి తీవ్ర గాయాలు

కఠ్మాండూ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్‌ విమానం దిగుతుండగా దుర్ఘటన

ఫుట్‌బాల్‌ మైదానంలోకి దూసుకుపోయి మంటల్లో చిక్కుకున్న విమానం

కఠ్మాండూ: నేపాల్‌ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా సాం కేతిక లోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం ఒరిగి పక్కనున్న ఫుట్‌బాల్‌ మైదానంలోకి దూసుకెళ్లింది.మంటలు అంటుకోవడంతో అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కొందరు మరణించారు. మిగతా వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెప్పారు.

విమానంలో 33 మంది నేపాలీలు ఉండగా.. 32 మంది బంగ్లాదేశీయులు, చైనా, మాల్దీవులకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.  నేపాల్‌ అధికారుల కథనం ప్రకారం.. యూఎస్‌–బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బాంబార్డియర్‌ డాష్‌ 8 క్యూ 400 విమానం 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సోమవారం ఉదయం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నుంచి కఠ్మాండుకు బయల్దేరింది. నేపాల్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో కఠ్మాండూ ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఈ ఘోరం జరిగింది.  విమానంలో నుంచి బ్లాక్‌ బాక్సును స్వాధీనం చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నామని టీఐఏ జీఎం రాజ్‌కుమార్‌ ఛత్రీ తెలిపారు.

చివరి నిమిషంలో సాంకేతిక లోపం వల్లే..
‘విమానాన్ని దక్షిణం వైపు రన్‌వేపై ల్యాండింగ్‌ చేసేందుకు అనుమతించాం. కానీ ఉత్తరంవైపు దిగింది. రన్‌వేపై దిగేందుకు ప్రయత్నించిన సమయంలో అదుపు తప్పింది. సాంకేతిక సమస్యలే కారణం కావచ్చని భావిస్తున్నాం’ అని నేపాల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ సంజీవ్‌ గౌతమ్‌ చెప్పారు. యూఎస్‌–బంగ్లా ఎయిర్‌లైన్స్‌ సీఈవో ఇమ్రాన్‌ అసిఫ్‌ మాట్లాడుతూ.. పైలట్‌కు ఏటీసీ తప్పుడు సిగ్నల్స్‌ ఇచ్చినట్లు తెలుస్తుందన్నారు.  

ల్యాండ్‌ అయ్యేముందే..
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బొహోరా ఆ ఘోరాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఢాకాలో విమానం టేకాఫ్‌ సమయంలోఇబ్బందులు లేవు. ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యేముందు విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఆ తరువాత పెద్ద శబ్దంతో పక్కకు ఒరిగింది. కిటికీ పక్కన కూర్చోవడంతో దానిని పగులగొట్టి బయటపడ్డాను’ అని చెప్పారు.

                                        ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top