జంతు హింస నిరోధానికి ఏం చేస్తున్నారు? | Telugu states queried by the High Court | Sakshi
Sakshi News home page

జంతు హింస నిరోధానికి ఏం చేస్తున్నారు?

Sep 5 2017 2:15 AM | Updated on Aug 31 2018 8:34 PM

జంతు హింస నిరోధానికి ఏం చేస్తున్నారు? - Sakshi

జంతు హింస నిరోధానికి ఏం చేస్తున్నారు?

జంతు హింస నివారణ, జంతు సంరక్షణ కోసం తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు

తెలుగు రాష్ట్రాలను ప్రశ్నించిన హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్‌: జంతు హింస నివారణ, జంతు సంరక్షణ కోసం తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జంతుహింస నివారణ, జంతువుల అక్రమ రవాణా, జంతు సంరక్షణ కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ సంస్థతోపాటు మరొకరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం.. జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా కమిటీల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నారో, వారికి ఉన్న వసతులు, బాధ్యతలు, విధులు, అక్రమ రవాణాలో పట్టుబడిన జంతువులను ఉంచేందుకు ఏవిధమైన ఏర్పాట్లు చేశారు.. వంటి వివరాలతో నివేదిక అందజేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. జిల్లా కమిటీలు సమర్థంగా పనిచేసేలా చూస్తామని ధర్మాసనం పేర్కొంది. అక్రమ రవాణాలో పట్టుబడిన జంతువులు ఎవరి పరిరక్షణలో ఉండాలని, ఈ కేసు తేలేవరకు వాటి విషయంలో ఏం చేయాలని పిటిషనర్‌ను  ప్రశ్నించింది. జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సింది పోలీసులని, వాటి సంరక్షణ బాధ్యత జిల్లా స్థాయిలోని జంతు హింస నిరోధక కమిటీలదేనని న్యాయవాది బదులిచ్చారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement