ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం | Rape attempt on Air Hostess in hyderabad | Sakshi
Sakshi News home page

ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం

Aug 31 2016 8:35 AM | Updated on Aug 14 2018 3:14 PM

ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం - Sakshi

ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం

అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై వెళుతున్న ఎయిర్‌హోస్టెస్‌ పై ఓ కామాంధుడు కన్నేశాడు..

అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిపై క్యాబ్ డ్రైవర్ కన్ను
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం
రాజేంద్రనగర్ ప్రాంతంలో ఘటన

 
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై వెళుతున్న ఎయిర్‌హోస్టెస్‌ పై ఓ కామాంధుడు కన్నేశాడు.. ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్లొద్దంటూ మభ్యపెట్టాడు.. కావాల్సిన చోటికి తీసుకెళ్లి వదిలిపెడతానంటూ నమ్మించి క్యాబ్ ఎక్కించుకున్నాడు.. ఆనక ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు.. గట్టిగా కేకలు వేయడంతో చివరికి ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు.. ఆ దుర్మార్గుడిని నిలువరించే యత్నంలో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ఆమెను రక్షించారు.

హైదరాబాద్ శివార్లలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లి హ్యపీహోమ్స్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (24) ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్ సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఆమెకు మందులు అవసరం ఉండడంతో పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 216 ప్రాంతానికి వచ్చింది. అక్కడ షాపులన్నీ మూసి ఉండడంతో రోడ్డు పక్కన నిలబడి ఉండగా... ఓ తెలుపు రంగు క్యాబ్ వచ్చి ఆమె వద్ద ఆగింది. దాని డ్రైవర్ ఆ యువతి వద్దకు వచ్చి ఇక్కడ ఎందుకు నిల్చున్నావని ప్రశ్నించాడు. ఆ ప్రాంతం మంచిది కాదని, ఒంటరిగా ఉండడం ప్రమాదకరమన్నాడు. ‘మీ ఇంటిదగ్గర వదిలేస్తా రమ్మ’ని నమ్మించి వాహనంలో ఎక్కించుకున్నాడు. వేగంగా రాజేంద్రనగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు.

ఆ యువతి గట్టిగా ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు. అయినా ఆమె నిలువరించడం, గట్టిగా కేకలు వేస్తుండడంతో... ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. వెంటనే ఆ యువతి రోడ్డుపైకి వచ్చి సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారయత్నం, దోపిడీ కింద కేసులు నమోదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నిందితుడిని కోసం గాలింపు చేపట్టారు. శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి ఆధ్వర్యంలోని ఈ బృందాలు రాజేంద్రనగర్, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాయి. అందులోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement